హాలియా : బౌద్ధధర్మం ప్రపంచ శాంతికి మార్గదర్శకమని శ్రీలంక సాంస్కృతిక శాఖ మంత్రి హిణిడుమ సునీల్ సెన్వీ అన్నారు. శనివారం నాగార్జునసాగర్ తీరంలోని బుద్ధవనాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో బౌద్ధ స్మారక చిహ్నాలు విశేష గుర్తింపు పొందాయన్నారు. బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో శాంతిస్థాపన అత్యంత కీలకమని పేర్కొన్నారు. బౌద్ధ ధర్మం ద్వారా అనేక విలువలు నేర్చుకోవచ్చన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రపంచ బుద్ధశాంతి సమావేశం తనకు విశేష అనుభవాన్ని, సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. బుద్ధవనం వంటి ఆధునిక బౌద్ధప్రాజెక్టులను శ్రీలంకలో కూడా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. మంత్రి పర్యటనలో 21 దేశాలకు చెందిన బౌద్ధ భిక్షువులు, భిక్షుణులు, విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో బుద్ధవనం చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య, ఫౌండర్ మాజీ డీజీపీ ఆంజనేయరెడ్డి, నటుడు గగన్‌మాలిక్, వియత్నాం ప్రొఫెసర్ తిక్నాథ్‌టు, నవ నలంద విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ సిద్ధార్థ్ సింగ్, ఎమ్మెల్యే రవీంద్ర తదితరులున్నారు.
ఫ శ్రీలంక మంత్రి హిణిడుమ సునీల్‌సెన్వీ


