
సరిహద్దు దాటొస్తున్న ఇసుక
మిర్యాలగూడ: ఆంధ్రాలో ఉచిత ఇసుక పథకం అమలవుతుండడంతో దానిని ఆసరాగా చేసుకున్న కొందరు దళారులు అక్కడి నుంచి ఇసుకను అక్రమంగా తెలంగాణకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందాలో ఓ ప్రజాప్రతినిధి కీలకంగా ఉండడంతో ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. రాత్రివేళ లారీల్లో పరిమితికి మించి ఇసుకను తరలిస్తూ ఖాళీ ప్రదేశాల్లో డంప్ చేసి అవసరమైన సమయాల్లో లక్షలు ఆర్జిస్తున్నారు.
లారీలు, టిప్పర్లల్లోనే ఇసుక తరలింపు..
తెలంగాణలో ఇసుక డిమాండ్ ఎక్కువగా ఉండడంతో దాన్ని కొందరు వ్యాపారంగా మలుచుకున్నారు. తమకున్న లారీలు, టిప్పర్ల ద్వారా ఏపీ నుంచి అక్రమంగా ఇసుకను మిర్యాలగూడకు తీసుకొచ్చి ఖాళీ స్థలాల్లో డంప్ చేసి అవసరమైన సమయంలో రెట్టింపు ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం మన ఇసుక వాహనం పేరిట ఆన్‌లైన్‌లో ఇసుక బుక్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. అలా చేస్తే ఇసుక డెలివరీ చేయడానికి చాలా రోజుల సమయం పడుతుండడంతో అవసరమైన వారు ఈ ఇసుక వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే రూ.3970కు వచ్చే ట్రాక్టర్ ఇసుక ఆఫ్‌లైన్‌లో మాత్రం రూ.5000 నుంచి రూ.7వేలకు కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీంతో ఏపీ నుంచి టిప్పర్లు, లారీల నుంచి ఇసుకను ఇక్కడకు తీసుకొస్తున్నారు. ఒక్కొక్క లారీలో 30టన్నులు, టిప్పర్‌లో 35టన్నుల ఇసుక పడుతుంది. కానీ వ్యాపారులు ఒక్కొక్క లారీలో 40 నుంచి 50టన్నులు, టిప్పర్‌లో 40 నుంచి 60 టన్నుల చొప్పున పరిమితికి మించి ఇసుకను తీసుకొస్తున్నారు.
నామమాత్రంగా కేసులు నమోదు..
ప్రధానంగా రాష్ట్ర సరిహద్దులో నిఘా లేకపోవడంతో ఈ ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. అంతేకాకుండా కృష్ణా నది సరిహద్దు గ్రామాల నుంచి అక్రమంగా పెద్దఎత్తున ఇసుక రవాణా సాగుతోంది. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీలను పోలీసులు పట్టుకుంటున్నా నామమాత్రంగా కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారే తప్ప.. నియంత్రించేందుకు చర్యలు చేపట్టడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసులు కూడా నమోదు చేస్తున్నారా లేదా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.
ఆంధ్రా నుంచి మిర్యాలగూడకు
లారీల్లో అక్రమంగా తీసుకొచ్చి
ఖాళీ స్థలాల్లో డంప్
రాత్రివేళ కొనసాగుతున్న దందా
అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఆంధ్రా ప్రాంతం నుంచి కూడా ఇసుక రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందిస్తే పట్టుకోని కేసులను నమోదుచేస్తాం. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం.
– రాజశేఖర్‌రాజు, డీఎస్పీ, మిర్యాలగూడ
పట్టుబడుతున్నా ఆగని దందా
మిర్యాలగూడ పట్టణంలో ఇసుక అక్రమ రవాణా అరికట్టడంలో పోలీసులు, మైనింగ్, రెవెన్యూ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ప్రతిరోజు లారీల కొద్ది ఇసుక మిర్యాలగూడకు తరలివస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. నెల రోజుల క్రితం వంగమర్తి నుంచి మిర్యాలగూడకు ఇసుకతో తరలివస్తున్న మూడు టిప్పర్లను రామచంద్రగూడెం వైజంక్షన్ వద్ద పట్టుకున్నారు. స్థానిక ఇసుక లారీ యజమానులు ఇచ్చిన సమాచారం మేరకు పట్టుకుని కేసు నమోదు చేశారు. 20 రోజుల క్రితం హనుమాన్‌పేట వద్ద ఆంధ్రాకు చెందిన ఓ ఇసుక లారీని పట్టుకున్నారు. ఆ విషయంలో పోలీసులు లోతుగా విచారణ చేయగా మిర్యాలగూడకు చెందిన ఓ ప్రజాప్రతినిధికి చెందిన ఐదు లారీలు నడుస్తున్నాయని తెలియడంతో విస్తుపోయారు. ఆ ప్రజాప్రతినిధి ఆదేశాల మేరకు కేసు నమోదు చేయకుండానే వదిలేసినట్లు సమాచారం. తాజాగా మంగళవారం మిర్యాలగూడ పట్టణ శివారులోని రైల్వేట్రాక్ వద్ద ఓ ఇసుక లారీని స్థానికులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఆ లారీ ఈ నెల 22న పర్మిట్ పొంది ఉంది. కానీ అందులో ఇసుక మాత్రం 27టన్నులకు గాను 56టన్నులు ఉంది. పరిమితికి మించి ఇసుక ఉండడంతో పాటు స్థానికంగా ఇసుకను డంప్ చేసి అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు మిర్యాలగూడ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.