చిట్టితల్లికి పెద్దకష్టం | - | Sakshi
Sakshi News home page

చిట్టితల్లికి పెద్దకష్టం

May 27 2025 1:50 AM | Updated on May 27 2025 1:50 AM

చిట్ట

చిట్టితల్లికి పెద్దకష్టం

భూదాన్‌పోచంపల్లి: 14 నెలల చిన్నారికి పెద్ద కష్టమొచ్చింది. జువైనల్‌ మైలో మోనోసైటిక్‌ లుకేమియా అనే క్యాన్సర్‌తో బాధపడుతోంది. తల్లిదండ్రులు కన్నబిడ్డను కాపాడుకోవడానికి ఆర్థిక స్థోమత లేక తల్లడిల్లుతున్నారు. దాతల ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. భూదాన్‌పోచంపల్లి మండలం వంకమామిడి గ్రామానికి చెందిన షేక్‌ జమాల్‌కు మొదటి సంతానంగా షేక్‌ ఐరా జన్మించింది. ఆరు నెలల క్రితం చిన్నారికి తీవ్ర జ్వరం వచ్చింది. ఆస్పత్రుల్లో చూపించినా తగ్గలేదు. ఈ క్రమంలో కడుపు ఉబ్బి పాలు తాగడానికి ఇబ్బంది పడింది. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చూపిస్తే గ్యాస్‌ ట్రబు ల్‌ అని మందులు ఇచ్చి పంపించారు. కానీ చిన్నారి ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేకపోవడంతో బీబీనగర్‌ ఎయిమ్స్‌ వైద్యుల సలహా మేరకు నీలోఫర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే నెలరోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నారు. రక్తంలో హిమోగ్లోబిన్‌ లేదని ఎముక మజ్జ టెస్టులు చేయగా రిపోర్టు నార్మల్‌గా వచ్చింది. దీంతో డాక్టర్లు మందులు రాసి పంపించారు.

ఉన్నట్లుండి తీవ్ర అస్వస్థత

ఐరాకు ఉన్నట్టుండి మూత్రవిసర్జన ఆగిపోయి, కడుపు ఉబ్బి తీవ్ర అస్వస్థతకు గురైంది. తల్లిదండ్రులు నెల రోజుల క్రితం బీబీనగర్‌ ఎయిమ్స్‌లోని ఐసీయూలో చేర్పించారు. పరీక్షలు చేయగా చిన్నారికి జువైనల్‌ మైలో మోనోసైటిక్‌ ల్యుకేమియా అనే క్యాన్సర్‌ వచ్చిందని డాక్టర్లు నిర్ధారించారు. కాలేయం, ప్లీహానికి కూడా వాపు వచ్చిందని, చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. కీమోథెరపి చేయాలని, అవసరమైతే ఎముక మజ్జ మార్పిడి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకు రూ.లక్షల్లో ఖర్చు అవుతుందని తెలిపారు. కూలీనాలీ చేసుకొని జీవనం సాగించే జమాల్‌ కుటుంబం తన బిడ్డను మెరుగైన చికిత్స చేయించుకోవడానికి ఆర్థిక స్థోమతలేక ఇబ్బంది పడుతున్నాడు. గత ఆరు నెలలుగా బిడ్డను కాపాడుకోవడానికి ఆస్పత్రుల చుట్టూ తిరిగి ఇప్పటికే రూ.2 లక్షల వరకు ఖర్చు చేశాడు. ప్రస్తుతం ఐరా బీబీనగర్‌లోని ఎయిమ్స్‌లోని పీడియాట్రిక్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో అత్యవసర చికిత్స పొందుతోంది. చిన్నారికి రెండు మూడు రోజుల కొకసారి రక్తం, ప్లేట్‌లెట్‌లు ఎక్కించాల్సి వస్తుందని మందులు, టెస్టులకు వేలల్లో ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆపన్నహస్తం అందించి ఆదుకోవాలని, సాయం చేసే దాతలు 76750 88204 నంబర్‌కు ఫోన్‌పే చేయాలని కోరుతున్నారు.

క్యాన్సర్‌తో పోరాడుతున్న

14 నెలల చిన్నారి

చికిత్స చేయించే ఆర్థికస్థోమత లేక

తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు

ఆదుకోవాలని వేడుకోలు

చిట్టితల్లికి పెద్దకష్టం1
1/1

చిట్టితల్లికి పెద్దకష్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement