
కరువు నేలన జలసిరులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నీటికి నిలకడ నేర్పితే కరువుఛాయలు దరిచేరవు. వాన నీటిని ఒడిసిపడితే జీవ వైవిధ్యం అలరారుతుంది. ఈ తరహాలో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం, వరద, వృథా నీటిని నిల్వ చేస్తూ చెక్‌డ్యామ్‌లు, నీటి కుంటలు, కందకాలు నిర్మించడం ద్వారా ఏ కాలమైనా నీటికి ఢోకా ఉండడం లేదు. వీటి నిర్మాణంతో సాగునీటి సమస్య నుంచి రైతులు బయటపడ్డారు. ఆయా ప్రాంతాల్లో పశుపక్ష్యాదులకు నిరంతరం నీరు దొరుకుతోంది. సమగ్ర నీటి సంరక్షణ చర్యలతో ఆయా పల్లెలు కరువును జయించాయి.
అష్టకష్టాల నుంచి గట్టెక్కి..
సూర్యాపేట మండలంలో గతంలో వేసవి ప్రారంభంలోనే ఎండిన చెరువులు, అడుగంటిన బోరుబావులతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. తాగునీటి కోసం మైళ్ల దూరం నడిచి వెళ్లి తెచ్చుకునే పరిస్థితి ఉండేది. తలాపున మూసీ నది ఉన్నా గుక్కెడు నీళ్లు దొరక్క, పంటలు పండని పరిస్థితి నుంచి ఇప్పుడు ఈ ప్రాంతం పూర్తిగా మారిపోయింది. గత ప్రభుత్వం మూసీ నది కింద 9 చెక్ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టి, ఆరింటిని పూర్తి చేసింది. టేకుమట్ల–2, రాయినిగూడెం–2, కాసారాబాద్–2 నిర్మాణం పూర్తి కాగా, ఝెడ్లపల్లి–1, కేటీ అన్నారం–1, కాసారాబాద్–1 నిర్మాణాలు పూర్తి కావొచ్చాయి. ఇప్పటికే పూర్తయిన నిర్మాణాలతో మండల పరిధిలోని భూగర్భ జలాలు పెరిగి ప్రజలకు తాగునీటి సమస్య తగ్గిపోయింది. బోరు బావులు, ఊట బావుల్లో నీరు సమృద్ధిగా ఉంటోంది. చెక్ డ్యామ్‌లలో నిల్వ ఉన్న నీటిని రైతులు మోటార్ల ద్వారా పొలాలకు తరలించుకుని పంటలు సాగుచేస్తున్నారు.
చెక్ డ్యామ్‌లతో తీరిన నీటి సమస్య
పెన్‌పహడ్ మండలంలో భూగర్భ జలాలు పెరిగేందుకు చెక్‌డ్యామ్‌లు దోహదపడుతున్నాయి. మండలంలోని దోసపహాడ్, అనాజీపురం, నాగులపహాడ్ గ్రామాల పరిధిలోని మూసీ నదిపై ఆరు చెక్ డ్యామ్‌లు నిర్మించారు. వీటి నిర్మాణంతో చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భజలాలు పెరిగాయి. వ్యవసాయ ఆధారిత బోర్లు, బావుల్లో నీరు సమృద్ధిగా ఉండటంతో ప్రజలకు వేసవిలో తాగునీటి నీటి సరఫరాలోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు.
ప్రతి వర్షపు చినుకు నీటిలో ఇంకేలా..
కరువు నేలలో జలాలను నిల్వ చేసి జీవం పోయడానికి పీఎం కృషి సంచాయ్ యోజన (పీఎంకేఎస్‌వై) పథకం కింద యాద్రాది భువనగిరి జిల్లాలో సంస్థాన్ నారాయణపురం మండలాన్ని ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్టు పరిధిలోని జనగాం, పుట్టపాక, వావిళ్లపల్లి, చిల్లాపురం, కొత్తగూడెం సహా 16 గ్రామాల్లో ఈ పథకాన్ని గతేడాది నుంచి అమలు చేస్తున్నారు. అక్కడ ప్రతి వానచినుకు భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టారు. కొండలు, వాలు ప్రాంతాల్లో పైనుంచి వచ్చే నీటిని భూగర్భ జలంగా మార్చేలా చెక్‌డ్యామ్‌లు, ఊట చెరువులు నిర్మించారు. పొలాల నుంచి మట్టి కొట్టుకుపోకుండా అడ్డుగా రాతి కట్టలు, కందకాల తవ్వకం చేపట్టారు. ఇప్పటి వరకు 68 పనులు పూర్తి చేశారు.
ఫ పెరుగుతున్న భూగర్భ జలాలు
ఫ వేసవిలోనూ బోర్లు, బావుల్లో సమృద్ధిగా నీరు
ఫ తాగు, సాగునీటి సమస్యకు చెక్
ఫ నీటి సంరక్షణతో కరువును జయిస్తున్న పల్లెలు

కరువు నేలన జలసిరులు