సైబర్ నేరంలో నిందితుడి అరెస్ట్
భీమవరం: డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధ దంపతులను వేధించి రూ.99 లక్షలు మోసం చేసిన కేసులో నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు భీమవరం వన్‌టౌన్ సీఐ ఎం నాగరాజు చెప్పారు. మంగళవారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఎస్సై కే మోహనవంశీతో కలసి వివరాలను వెల్లడించారు. మహరాష్ట్రకు చెందిన 19 ఏళ్ల యువకుడు ప్రీతమ్ ధర్మేంద్రమౌర్య ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన భీమవరంలోని గంధం అపార్ట్‌మెంట్‌కు చెందిన వృద్ధ దంపతులకు ఫోన్ చేసి మీ పిల్లలను తీవ్రమైన కేసుల్లో ఇరికిస్తామంటూ బెదిరించాడు. డిజిటల్ అరెస్ట్ పేరుతో సుమారు రూ.99 లక్షలు కాజేశాడు. దీనితో సెప్టెంబర్ 10వ తేదీన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు ప్రీతమ్ ధర్మేంద్రమౌర్యను ఈనెల 15వ తేదీన అరెస్ట్ చేసి విచారించగా అంతర్జాతీయ సైబర్ నేరాల్లో కీలకంగా పనిచేసినట్లు తేలిందని సీఐ నాగరాజు చెప్పారు. ఈ కేసులో వివిధ బ్యాంక్ ఖాతాల్లో సుమారు రూ.14.11 లక్షలు ఫ్రీజ్ చేశామన్నారు. కేసు ఛేదనలో డీఎస్పీ ఆర్‌జీ జయసూర్య నేతృత్వంలో భీమవరం, ఉండి ఎస్సైలు కె మోహనవంశీ, నసీరుల్లా, రహమాన్, సిబ్బంది పి శ్రీనివాసరావు, ఎం.రామకృష్ణ, యోహోషువ కీలకంగా వ్యవరించినట్లు నాగరాజు చెప్పారు.


