యథేచ్ఛగా అటవీ కలప తరలింపు
కొయ్యలగూడెం: అటవీ సంపదను అక్రమంగా తరలిస్తున్న అక్రమార్కులకు అద్దూఅదుపు లేకుండాపోతోంది. కన్నాపురం అటవీ శాఖ రేంజ్ కార్యాలయానికి ఎదురుగానే అక్రమంగా అడవిలో నుంచి నరికి వేసిన కలపను ట్రాక్టర్ పై శుక్రవారం అక్రమార్కుల యథేచ్ఛగా తరలించారు. ఇప్పటికే కన్నాపురం రేంజ్ పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్ యథేచ్చగా నరికి వేస్తుండడంతో అక్రమ కలప రవాణా నిరోధించాల్సిన అటవీశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో అటవీ సంపదను అక్రమంగా రాత్రులు మాత్రమే తరలించేవారు. అయితే అధికారుల నైరాస్యం, అలసత్వం, అవినీతి వల్ల పట్టపగలే ట్రక్కుల్లో అక్రమ కలప తరలిపోతున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బ్యారన్ క్యూరింగ్ కోసం అటవీ సంపదను తరలిస్తున్నప్పటికీ నామమాత్రంగా కూడా కేసులు నమోదు చేయకపోవడం గమనార్హం. అక్రమార్కులు సందిట్లో సడేమియా అన్నట్లుగా రిజర్వ్ ఫారెస్ట్‌లోని విలువైన కలపను కూడా యంత్రాలతో నరికి గృహోపకరణాలకు విక్రయిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. కేవలం నాలుగు నెలల వ్యవధి కాలంలో ఒక్కో బీట్ పరిధిలో రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అటవీ శాఖ అధికారులకు, సిబ్బందికి మామూళ్లు అందుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు అక్రమ కలప నిరోధం, చెట్ల నరికివేతను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


