ఏలూరులో జోరుగా చోరీలు
ఒకే రోజు రెండు ఇళ్లల్లో దొంగతనాలు
ఏలూరు టౌన్: ఏలూరు రూరల్, టూటౌన్ పరిధిలో రెండు ఇళ్లల్లో చోరీ జరిగింది. భారీగా బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు అపహరించుకుపోయారు. వివరాల ప్రకారం ఏలూరు రూరల్ పరిధిలో చొదిమెళ్ళ ప్రాంతంలో శ్రీ లక్ష్మీ గణపతినగర్ 5వ రోడ్డులో నివాసం ఉంటున్న వేమూరి వెంకట అనంత రామం భార్యపిల్లలతో కలిసి ఈనెల 26న తూర్పుగోదావరి జిల్లాలోని శివాలయానికి వెళ్లి అదేరోజు రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చారు. ఈలోగా దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువా తాళాలు తెరిచి సుమారు 20 కాసుల బంగారు ఆభరణాలు, కిలో వెండి దోచుకుపోయారు. బాధితుడి ఫిర్యాదుతో ఏలూరు రూరల్ ఎస్సై నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏలూరు టూటౌన్ పరిధిలో మోతేవారి తోటలో తాళాలు వేసిన ఇంటిలో దొంగలు పడ్డారు. ఇంటి యజమానులు హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. తాళాలు పగులగొట్టి ఇంటిలోకి వెళ్లిన దొంగలు భారీగా బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు చెబుతున్నారు.


