
దళిత వాడలకు ఏం చేశారు?
ఉండి: కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్నా దళితవాడలకు ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత నాయకుడు జొన్నల వజ్రం ఆధ్వర్యంలో శుక్రవారం అర్తమూరులో మాలమహానాడు బృందం పర్యటించింది. ఈ సందర్భంగా పుష్ఫరాజ్ మాట్లాడుతూ ప్రతీ పంచాయతీకి ఇచ్చే సబ్‌ప్లాన్ నిధులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యేలు కనీసం దళితవాడల్లో పరిస్థితులపై పర్యటించి పరిశీలించడం లేదని అన్నారు. నిధులను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. పేదల చదవుల కోసం చేపట్టిన మెడికల్ కాలేజ్‌లు పీపీపీ పద్దతిలో ప్రైవేటీకరణ ఎలా చేపడతారని ప్రశ్నించారు. పేదలు చదవుకోవడం ప్రభుత్వానికి ఇష్టం లేదా అని అన్నారు. వాహనమిత్ర పథకం అమలులో పక్షపాతాన్ని ప్రశ్నించారు. అర్హులకు కూడా పథకాలు ఇవ్వకపోతే కూటమి ప్రభుత్వం ఎవరికి ఇస్తుందని ప్రశ్నించారు. వజ్రం అనే ఆటోడ్రైవర్‌కు వాహనమిత్ర ఎందుకు రాలేదో కనీస కారణం కూడా అధికారులు తెలియకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో మాలమహానాడు నాయకులు జొన్నల వజ్రం, నేతల సువర్ణరాజు, ఇంటి సుందర్‌కుమార్, కోలా ప్రసాదరావు, మున్నా, దాసరి చిరంజీవి పాల్గొన్నారు.