
కూటమి ప్రభుత్వానిది డ్రామా పాలన
తాడేపల్లిగూడెం అర్బన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డ్రామా పాలనలా ఉందని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్రంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తున్నామని మాయ చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలూ డేటా సెంటర్లను నిరాకరిస్తే.. ఽకోట్లు దండుకోవడానికే చంద్రబాబునాయుడు వమన రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి కుట్రలు చేస్తున్నాడన్నారు. పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తున్న వైఎస్సార్ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు సుమారు రూ.3 వేల కోట్ల బకాయిలు ఇవ్వకపోవడంంతో ఆయా ఆసుపత్రులు ఆరోగ్యశ్రీలో వైద్యం నిలిపివేశాయని, దీంతో పేద ప్రజలు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 108 అంబులెన్స్‌లకు పెట్రోలు బిల్లులు చెల్లించకపోవడం, సిబ్బందికి జీతాలు నిలుపుదలం చేయడంతో వాహనాలు సేవలు అందించలేకపోతున్నాయన్నారు.
కూటమిది దుర్మార్గ పాలన
అయ్యన్నపాత్రుడు రాష్ట్రంలో వైద్య కళాశాలలు నిర్మించడానికి జీఓ విడుదల కాలేదని అసెంబ్లీ సమావేశాల్లో చెప్పడం కూటమి ప్రభుత్వ దుర్మార్గ పాలనకు ఉదాహరణ అని దుయ్యబట్టారు. హామీలు అమలు చేయకపోవడాన్ని ప్రశ్నిస్తారనే భయంతో ప్రజలను ఏమార్చేందుకు కొత్త డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ ఎక్కడ ప్రజా సమావేశాలు ఏర్పాటు చేసినా చంద్రబాబుకు చెమటలు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. నెల్లూరులో వైఎస్సార్‌సీపీ సమావేశాన్ని నిర్వహించకుండా పోలీసులను అడ్డు పెట్టినా వైఎస్సార్‌సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు సభను విజయవంతం చేశారన్నారు. అధికారంలో ఉన్న టీడీపీ నాయకులతో కూటమి ప్రభుత్వమే కల్తీ మద్యం తయారు చేయించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం షాపులకు సరఫరా చేస్తోందని విమర్శించారు. అరాచక పాలనను గమనిస్తున్నారనే భయంతో ప్రజలను డైవర్షన్ చేసేందుకు పవన్ కల్యాణ్ కాకినాడ పర్యటన, రూట్ మ్యాప్ విడుదల చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కూటమికి గుణపాఠం చెప్పి వైఎస్ జగన్‌మోహనరెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి కొట్టు స్పష్టం చేశారు.
మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ