
దివ్యాంగులకు ఎన్నాళ్లీ పాట్లు?
తణుకు అర్బన్: తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో నిర్వహిస్తున్న దివ్యాంగుల పింఛను వెరిఫికేషన్ పింఛనుదారుల సహనానికి పరీక్షగా మారింది. శుక్రవారం పింఛను వెరిఫికేషన్‌కు ఉదయం 9 గంటలకు హాజరైన దివ్యాంగులు సాయంత్రం వరకు కూడా చేయకపోవడంతో విలవిల్లాడిపోయారు. కూటమి ప్రభుత్వం తమకు చుక్కలు చూపిస్తుందని, గతంలో లేని వెరిఫికేషన్‌లు ఇప్పుడేంటని, 20 ఏళ్లుగా పింఛను తీసుకుంటున్న తమకు ఈ పరీక్షలేంటని, పింఛను తీసేందుకే ఈ పరీక్షలా అని గగ్గోలుపెట్టారు. వెరిఫికేషన్‌కు వైద్యులు కేంద్రం వద్దే అందుబాటులో ఉన్నప్పటికీ సాంకేతికత లోపంతో వెరిఫికేషన్ చేయలేకపోయిన దుస్థితి. శుక్రవారం సుమారుగా 60 మంది వరకు వచ్చారు. సదరం లాగిన్‌లో సాంకేతిక ఇబ్బందులతో రోజంతా పడిగాపులు పడాల్సివచ్చింది. ఎట్టకేలకు సాయంత్రం 4 గంటలకు కన్నుకు సంబంధించిన దివ్యాంగులకు వెరిఫికేషన్ పూర్తిచేయగా ఆర్ధోపెడిక్‌కు సంబంధించి 40 మంది వరకు వేచిచూడాల్సి వచ్చింది.
ఏ సదుపాయాలు లేవు
పింఛను వెరిఫికేషన్‌కు వచ్చిన దివ్యాంగులకు ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడంతో దివ్యాంగులు అల్లాడిపోయారు. కుర్చీలు తప్ప మరే ఇతర వసతి కల్పించలేదని పింఛనుదారులు ఆరోపించారు. ఆహారం తిని రమ్మని సిబ్బంది చెప్పారని పింఛనుతోనే బతుకుతున్న ఏం కొనుక్కుని తినగలమని, ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడంలేదంటూ దివ్యాంగులు ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు సాయంత్రం 5 గంటలకు ఈరోజు వెరిఫికేషన్ అవ్వదని, ఎప్పుడు రావాలో తిరిగి ఫోన్ చేస్తామని సిబ్బంది చెప్పడంతో దివ్యాంగులు ఉసూరుమంటూ వెనుదిరిగారు. ఈ సమస్యపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.సాయికిరణ్‌ను వివరణ కోరగా దివ్యాంగుల వివరాలు సదరం లాగిన్‌లో వారిని జంగారెడ్డిగూడెంగా చూపిస్తుండడంతో సాంకేతిక కారణాలతో వెరిఫికేషన్ చేయడం కుదరలేదని చెప్పారు.

దివ్యాంగులకు ఎన్నాళ్లీ పాట్లు?