కుళాయి కనెక్షన్లకు కూటమి వసూళ్లు | - | Sakshi
Sakshi News home page

కుళాయి కనెక్షన్లకు కూటమి వసూళ్లు

Jul 24 2025 6:58 AM | Updated on Jul 24 2025 6:58 AM

కుళాయి కనెక్షన్లకు కూటమి వసూళ్లు

కుళాయి కనెక్షన్లకు కూటమి వసూళ్లు

భీమవరం అర్బన్‌: మండలంలోని తాడేరు గ్రామంలో కూటమి నాయకులు గ్రామస్తులపై ప్రత్యేక పన్నులు వేసి డబ్బులు వసూలు చేస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. తాడేరు గ్రామంలో మొత్తం జనాభా 3,600 పైగా నివసిస్తున్నారు. వీరికి తాగునీటిని సరఫరా చేసేందుకు వెయ్యి కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. గ్రామస్తులకు అవసరమయ్యే తాగునీటిని పంచాయతీ అధికారులు సరిపెట్టలేకపోతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. గ్రామంలో ఎవరైనా కుళాయి కనెక్షన్ల కోసం పంచాయతీ ద్వారా అన్ని అనుమతులు పొందితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీకి రూ.4,100 చెల్లించాలి. గతంలో కొత్తగా కుళాయి కనెక్షన్లు పొందాలంటే మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు చేస్తేనే కాని అనుమతులు ఇవ్వమని పంచాయతీ అధికారులు గ్రామస్తులకు తెలియజేశారు. అయితే ఇప్పటికే గ్రామంలో తాగునీరు సరిపోక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు చేయకుండానే కొత్తగా 40 కుళాయి కనెక్షన్లు పంచాయతీ అధికారులు మంజూరు చేయడంపై గ్రామంలో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

గ్రామాభివృద్ధి కమిటీ పేరుతో అదనపు వసూళ్లు

నూతనంగా కుళాయి కనెక్షన్‌ తీసుకోవాలంటే అన్ని అనుమతులు ఉంటే రూ.4,100 చెల్లిస్తే సరిపోతుంది. అయితే జనసేన నాయకులు గ్రామాభివృద్ధి కమిటీ పేరుతో మరో రూ.5,900 కలిపి మొత్తం రూ.11 వేలు కడితేనే నూతన కుళాయి కనెక్షన్‌ ఇస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రత్యేకంగా గ్రామాభివృద్ధి కమిటీ పేరుతో ఒక రసీదు బుక్కు తయారుచేయించి నాన్‌ లేఅవుట్లలో కుళాయి కనెక్షన్‌ పొందాలనుకునే వారి నుంచి రూ.11 వేలు, అన్ని అనుమతులు ఉండి కుళాయి కనెక్షన్‌ పొందాలనుకుంటే రూ.6 వేలు చొప్పున వసూలు చేసి జనసేన నాయకులు రసీదులు ఇస్తున్నారని చెబుతున్నారు. ఈ విధానం పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకమని, అధికార పార్టీ నాయకులు వసూళ్లు చేసి దోపిడీ చేస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అక్రమ వసూళ్లను గ్రామంలోని వివిధ పార్టీల నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వసూళ్లు చేసిన నగదును ఏ అభివృద్ధికి వినియోగిస్తారో.. ఎవరికి లెక్కలు చెబుతారో కూడా తెలియని పరిస్థితి.

గ్రామ కార్యదర్శి వివరణ

గ్రామాభివృద్ధి కమిటీ పేరుతో వసూళ్ల విషయమై గ్రామ కార్యదర్శి పార్వతిని వివరణ కోరగా ఆ కమిటీకి, పంచాయతీకి ఎలాంటి సంబంధం లేదని, కుళాయి కనెక్షన్‌కు అన్ని అనుమతులు ఉంటే రూ.4,100 చెల్లిస్తే మంజూరు చేస్తామని చెప్పారు.

గ్రామ అభివృద్ధి కమిటీ పేరుతో దందా

రూ.11 వేల చొప్పున వసూలు

గ్రామస్తుల మండిపాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement