
పీడీ అసభ్య ప్రవర్తనపై విచారణ
కలిదిండి (కై కలూరు): స్థానిక ప్రభుత్వ జెడ్పీ ఉన్నత పాఠశాల పీడీ కోటి రత్నదాస్‌పై బాలికలు, హెచ్‌ఎం చేసిన ఆరోపణలపై జిల్లా విద్యాశాఖాధికారిణి వెంకటలక్ష్మమ్మ ఆదేశాలతో డీవైఈవో నిమ్మగడ్డ రవీంద్రభారతీ పాఠశాలలో బుధవారం విచారణ చేశారు. విద్యార్థినుల పట్ల పీడీ అసభ్యకర ప్రవర్తనపై మంగళవారం మీడియా ద్వారా వెలుగు చూసింది. హెచ్‌ఎం బి.స్వర్ణకుమారి, మరో 19 మంది ఉపాధ్యాయుల నుంచి ముందుగా రూపొందిచిన ప్రశ్నావళిని డీవైఈవో పూర్తి చేయించారు. బాలికల నుంచి పూర్తి వివరాలను తెలుసుకున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పీడీ రత్నదాసు నుంచి వివరణ తీసుకున్నారు. విచారణ నిమిత్తం పది రోజుల పాటు అతనితో ప్రేరేపిత సెలవు పెట్టించారు. విచారణ అధికారి రవీంద్రభారతీ మాట్లాడుతూ హెచ్‌ఎం, సహచర ఉపాధ్యాయులు, బాలికల నుంచి వివరాలు సేకరించామని, నివేదికను జిల్లా అధికారికి సమర్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కలిదిండి మండల ఎంఈవోలు రవిప్రకాష్, శ్రీనివాసరావు, ఐసీడీఎస్ కై కలూరు సెక్టార్ సీడీపీవో డాక్టర్ ఎన్.దీప్తి, ఏలూరు ఐసీడీఎస్ సాంస్థగతేతర సంరక్షణ అధికారి(పీవోఎన్‌ఐసీ) జయలక్ష్మి, పాఠశాల హెచ్‌ఎం బి.స్వర్ణకుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.