
సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు
ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. సదూర ప్రాంతాల నుంచి భారీసంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి వారి పుట్టలో పాలు పోశారు. పాలపొంగళ్ల శాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద స్వామివారి మూర్తులను ప్రతిష్ఠించేందుకు అర్చకులతో పూజలు చేయించి ప్రతిష్ఠ తంతు నిర్వహించారు. నాగబంధాల వద్ద, గోకులంలోని గోవులకు మహిళలు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాద ఏర్పాట్లు చేశారు.
గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు
బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కాపవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఆలయ కమిటీ వారు సోలార్ విద్యుత్ సదుపాయం కల్పించడం, ఫ్యాన్లు ఏర్పాటు చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
పెదవేగి: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సివిల్ సప్లయ్ అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్ ఎస్సై రంజిత్‌కుమార్ వివరాల ప్రకారం.. తడికలపూడి నుంచి దోసపాడు రైస్ మిల్లుకు రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం మేరకు నిఘా పెట్టారు. పెదవేగి మండలం ముండూరు సమీపంలో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, ఆ వాహనంలో 4,700 కేజీల రేషన్ బియ్యాన్ని అధికారులు గుర్తించారు. తడికలపూడికి చెందిన ఈడ్పుగంటి శ్రీనివాస్ రైస్‌మిల్‌కు పంపుతున్నట్లు గుర్తించారు. సరుకు విలువ రూ.1,72000 ఉంటుందని చెప్పారు.
13 మంది అరెస్ట్
కామవరపుకోట: స్థల వివాదంలో 13 మందిని అరెస్టు చేసినట్లు తడికలపూడి ఎస్సై పి.చెన్నారావు తెలిపారు. రెండ్రోజుల క్రితం కామవరపుకోటలోని వీరభద్ర స్వామి ఆలయానికి సంబంధించిన స్థల వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఘర్షణలో, ఒక వర్గానికి చెందిన ఇంటిపై మరో వర్గం దాడి చేసింది. ఆ ఇంటిని ధ్వంసం చేయడమే కాకుండా ఇంట్లో ఉన్న ముగ్గురు అన్నదమ్ములను తీవ్రంగా గాయపరిచారు. బాధితుడు షేక్ అబ్దుల్ నవీ ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్ష్యాల ఆధారంగా ఇంతవరకు 13 మందిని గుర్తించారు. వారిని చింతలపూడి కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు.

సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు