
సోలార్ లైట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు
బుట్టాయగూడెం : మండలంలోని ప్రసిద్ధ గుబ్బల మంగమ్మ గుడికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం సోలార్ ద్వారా లైట్స్, ఫ్యాన్‌లు, సీసీ కెమెరాలతోపాటు మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధి కొర్సా గంగరాజు మాట్లాడుతూ తెల్లవారుజామునే ఇక్కడికి చేరుకునే భక్తులు చీకటిగా ఉండడంతో మంగమ్మతల్లిని దర్శించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో టెల్ టవర్స్ సోలార్ కంపెనీ ద్వారా మంగమ్మతల్లి ఆలయం వద్ద సోలార్ కరెంట్ సదుపాయం, సీసీ కెమెరా, ఫ్యాన్‌లు, మంచినీటి సదుపాయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
14 నెలల తర్వాత బంగారం చోరీపై కేసు నమోదు
కై కలూరు: బంగారు గాజులు చోరీ జరిగిన 14 నెలల తర్వాత ఓ మహిళ కై కలూరు రూరల్ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేసింది. రామవరం గ్రామానికి చెందిన సోము సీతామహాలక్ష్మీ(62) భర్త ఆరేళ్ల క్రితం మరణించాడు. కుమారుడు ఇతర ప్రాంతంలో ఉంటాడు. ఆమె ఇంటి వద్ద కిరాణా దుకాణం నడుపుతోంది. అయితే 2024 ఫిబ్రవరి 13న ఆమె రెండు బంగారు గాజులు గల్లా పెట్టెలో వేసి స్నానానికి వెళ్లింది. తిరిగి వచ్చి చూసుకునేసరికి కనిపించలేదు. కొన్నాళ్లు వెతికి ఊరుకుంది. ఇటీవల కుమారుడు ఇంటికి రావడంతో అతడికి విషయం చెప్పింది. దీంతో అతని సలహా మేరకు ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు రూరల్ ఎస్సై రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం మత్తులో వ్యక్తిపై బ్లేడుతో దాడి
భీమవరం: స్థానిక టూ టౌన్ ఏరియా బైపాస్ రోడ్డు దగ్గర ఓ వ్యక్తిని బ్లేడుతో గొంతుకోసిన సంఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లంకపేటకు చెందిన సీహెచ్ సాయిబాబు, ఎస్‌కే వినోద్ ఇద్దరూ ఓ చోట మద్యం తాగుతున్నారు. ఆ సమయంలో ఇద్దరూ సరదా కబుర్లతో కోడిగుడ్లు విసురుకున్నారు. అంతలోనే వినోద్ కోపోద్రిక్తుడై బ్లేడుతో సాయిబాబు గొంతు కోసి పారిపోయాడు. బాధితుడు ప్రస్తుతం భీమవరం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సీఐ జి.కాళీచరణ్, పోలీసులు బృందాలుగా వెళ్లి నిందితుడి కోసం గాలిస్తున్నారు.