
ఉపాధి హామీ పనులను తనిఖీ చేయాలి
నూజివీడు: ఉపాధి హామీ పనుల్లో తప్పుడు మస్తర్ నమోదు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మండలాల్లో ప్రోగ్రాం ఆఫీసర్లు ఉపాధి హామీ పనుల నిర్వహణలో చురుగ్గా వ్యవహరించాలని కలెక్టర్ కే వెట్రిసెల్వి ఆదేశాలు జారీ చేసినట్లు డ్వామా పీడీ వెంకట సుబ్బారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘మస్తర్లలో మాయాజాలం’ పేరుతో ఉపాధిహామీ పనుల్లో జరుగుతున్న అవకతవకలను ‘సాక్షి’ మంగళవారం ప్రచురించడం జరిగింది. దీనిపై కలెక్టర్ స్పందించి ప్రోగ్రాం ఆఫీసర్లు తప్పనిసరిగా మస్తర్లు తనిఖీ చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. నూజివీడు మండలంలో జిల్లా విజిలెన్స్ అధికారి, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సంయుక్తంగా విచారణ నిర్వహించారని, వారి నుంచి నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉపాధి హామీ పథకాన్ని మరింత పారదర్శకంగా నిర్వహించి ఎక్కువమంది శ్రామికులకు పని కల్పించి వారు ఆశించిన వేతనలు అందేలా కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో ఉపాధిహామీ పథకం విజయవంతంగా నిర్వహించబడుతుందని, గతేడాది కోటి 20 లక్షల పని దినాల లక్ష్యానికి కోటి 23 లక్షల 65 వేల పనిదినాలు కల్పించి 103 శాతం పైగా వృద్ధిని సాధించామన్నారు. గతంలో ఉపాధి హామీ వేతనం సరాసరి రూ.300 కాగా దానిని ప్రభుత్వం రూ.307కు పెంచిందన్నారు. ఈ మేరకు గత ఏడాది రూ.300 వేతన సరాసరికి జిల్లాలో రూ.253 సాధించామన్నారు. ఈ ఏడాది పెరిగిన సరాసరి వేతనానికి అనుగుణంగా కనీసం రూ.290 తగ్గకుండా వేతనం కల్పించి ఉపాధి హామీపై మరింత నమ్మకం కలిగేలా చర్యలు చేపట్టామన్నారు. ఉపాధిహామీ పనులకు సంబంధించి ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించిన పనులకు రూ.280 సరాసరి వేతనం చెల్లించడం జరిగిందన్నారు.
కలెక్టర్ ఉత్తర్వులు జారీ