గంధకంతో ఉద్యాన పంటల్లో అధిక దిగుబడులు | - | Sakshi
Sakshi News home page

గంధకంతో ఉద్యాన పంటల్లో అధిక దిగుబడులు

Apr 30 2025 12:41 AM | Updated on Apr 30 2025 12:48 AM

గంధకం

గంధకంతో ఉద్యాన పంటల్లో అధిక దిగుబడులు

చింతలపూడి: ఉద్యాన పంటల్లో మొక్కల పెరుగుదలకు, అభివృద్ధికి అవసరమైన ముఖ్యమైన పోషక పదార్థాల్లో గంధకం ఒకటి. ఉద్యాన పంటల్లో గంధకం వాడకం వల్ల 25 శాతం దిగుబడి పెరుగుతుందని ఉద్యానాధికారి ఎండీ షాఫియ ఫర్‌హీన్‌ తెలిపారు. మెట్ట ప్రాంతంలో రైతులు ఉద్యాన పంటలను ఎక్కువగా పండిస్తుంటారని, ఈ నేపథ్యంలో ఉద్యాన పంటల్లో వాడే పోషకాలను గురించి ఆమె వివరించారు. సాధారణంగా మెట్టప్రాంత రైతులు స్థూల పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాస్‌, మెగ్నీషియం, బోరాన్‌లను వాడుతుంటారన్నారు. వీటితో పాటు అదనంగా గంధకం వాడితే ఆయిల్‌పాం, కొబ్బరి, నిమ్మ, బత్తాయి, అరటి, మామిడి తోటల్లో దిగుబడి గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

గంధకం ఉపయోగాలు

గంధకం క్లోరోఫిల్‌ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేయడానికి అవసరం. కొన్ని విటమిన్ల ఉత్పత్తికి గంధకం చాలా అవసరం. పండ్ల రుచి, వాసన, రంగును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఉదాహరణకు, ఉల్లిపాయ, వెల్లుల్లిలో వాటి ప్రత్యేకమైన వాసన గంధకం వల్లనే వస్తుంది. కొన్ని సందర్భాల్లో, గంధకం శిలీంద్ర నాశినిగా, కొన్ని రకాల తెగుళ్లను నివారించడానికి కూడా ఉపయోగించబడుతుంది.

వేటిలో లభిస్తుందంటే..

గంధకం మనకు సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌, అమ్మోనియ సల్ఫేట్‌, జిప్సం, సల్ఫేట్‌ ఆఫ్‌ పొటాష్‌, జింక్‌ సల్ఫేట్‌, మెగ్నీషియం సల్ఫేట్‌, మాంగనీస్‌ సల్ఫేట్‌, ఐరన్‌ సల్ఫేట్‌ల రూపంలో మార్కెట్లో దొరుకుతుంది. గంధకం నేలలో వాడినప్పుడు దాని ఆమ్ల స్వభావం నేల ఉదజని సూచిక 6 నుంచి 6.5 వరకు వచ్చే సరికి నేలలోని అన్నిరకాల పోషకాలు మొక్కకు అందుబాటులోకి వస్తాయి. చౌడు భూములను బాగు చేసుకోవడానికి నేలలోని ఉదజని సూచికను బట్టి ఎకరానికి 500 కేజీల జిప్సంను వాడినట్లయితే దిగుబడి బాగా పెరుగుతుంది. గంధకం వాడకంతో పంట నాణ్యత, పరిమాణము, గింజల్లో నూనె శాతం పెరుగుతుంది.

ఆదాయం పెరుగుతుంది

ఉద్యాన పంటల్లో తక్కువ ధరలో అందుబాటులో ఉండే జిప్సం, సల్ఫేట్‌ ఆఫ్‌ పొటాష్‌ 50 శాతం, సల్ఫర్‌ గుళికలు 90 శాతం వాడినట్లయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందవచ్చు. కాపుకాసే తోటలైతే 500 గ్రాములు, వయస్సును బట్టి 5 నుంచి 10 కేజీల జిప్సం సంవత్సరానికి రెండు సార్లు వేసుకున్నట్లయితే దిగుబడులు పెరుగుతాయి. ఇతర పండ్ల తోటలకు, కూరగాయల తోటలకు అయితే దుక్కిలో ఎకరానికి నేల స్వభావాన్ని బట్టి 300 నుంచి 500 కేజీల జిప్సంను వాడుకోవచ్చు.

గంధకంతో ఉద్యాన పంటల్లో అధిక దిగుబడులు 1
1/2

గంధకంతో ఉద్యాన పంటల్లో అధిక దిగుబడులు

గంధకంతో ఉద్యాన పంటల్లో అధిక దిగుబడులు 2
2/2

గంధకంతో ఉద్యాన పంటల్లో అధిక దిగుబడులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement