
వృద్ధులపై వేధింపులు అరికట్టాలి
ఏలూరు (టూటౌన్): వృద్ధులపై వేధింపుల నివారణ దినోత్సవం సందర్భంగా.. వృద్ధుల సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా, నగర సీనియర్ సిటిజన్స్ యూనియన్ నాయకులు శుక్రవారం ఏలూరు కలెక్టరేట్‌లోని జేసీ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రాపు శివరామకృష్ణారావు మాట్లాడుతూ.. జూన్ 15న ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవంగా ఐరాస ప్రకటించిందని గుర్తు చేశారు. వృద్ధుల పోషణ, ఆస్తి, ప్రాణ రక్షణకు కేంద్ర ప్రభుత్వం 2007లో సంరక్షణ చట్టం చేసిందన్నారు. 2011లో రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టానికి నిబంధనలు తయారు చేసి రాష్ట్రంలో అమలు చేయాలని ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. చట్టం అమలులోకి వచ్చి 13 సంవత్సరాలు పూర్తయినా నేటికీ పటిష్టంగా అమలు కావడంలేదన్నారు. సీనియర్ సిటిజన్స్ జిల్లా కమిటీ సమావేశాలు ప్రతి మూడు నెలలకు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ట్రిబ్యునల్ తీర్పులు పటిష్టంగా అమలు చేయాలని కోరారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేకంగా ఒక హెడ్ కానిస్టేబుల్‌ను నియమించి వృద్ధుల సమస్యలపై స్పందించేలా చర్యలు తీసుకోవాల న్నారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ ఏలూరు జిల్లా కోశాధికారి నారాయణరావు, కౌన్సిల్ సభ్యులు నారాయణ, సుబ్రహ్మణ్యం, ఏలూరు యూనిట్ అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తదితరులున్నారు.