
ఎరువులు, పురుగుమందుల వినియోగం లేకుండా జీరో కాస్ట్, ప్రకృతి విధానంలో సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ప్రకృతి సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తోంది. ఈ విధానంలో నవధాన్యాలను పచ్చిరొట్ట తరహాలో భూమిలో కలియదున్నడం ద్వారా భూసారం పెరిగి ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను పండించవచ్చు. అంతేకాక నవధాన్యాల విత్తనాలను డ్వాక్రా గ్రూపు మహిళల ద్వారా రైతులకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. దీని వల్ల క్షేత్రస్థాయిలో సాగు విస్తరణ పెరగడంతో పాటు డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడనుంది.
తాడేపల్లిగూడెం రూరల్: ప్రకృతి విధానం సాగులో రైతులు తాము పండించిన పంట వారం రోజుల్లో కోతకు వస్తుందనగా నవధాన్యాలు (33 రకాల ధాన్యాలు) విత్తనాలను చల్లుకోవాలి. వారం రోజుల్లో విత్తనాలు మొక్క దశకు చేరుకుంటాయి. 35 నుంచి 40 రోజులలో పూర్తి స్థాయిలో ఎదుగుతాయి. వీటిల్లోనే పశువులను మేపుకోగా, మిగిలిన దానిని దుక్కిలో దున్ని వారం రోజుల పాటు ఉంచుతారు. ఇలా చేయడం వల్ల 50 శాతానికి పైగా పోషకాలు భూమికి అందుతాయి. దీనివల్ల ఎరువులు, పురుగు మందులు వినియోగం 50 శాతానికి పైగా తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల పంటకు చీడపీడలు కూడా ఆశించవు. పంట కూడా ఆరోగ్యకరంగా పెరుగుతుందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
ఎస్‌హెచ్‌జీ గ్రూపుల ద్వారా తయారీ
తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా నవధాన్యాల ప్యాకెట్లను తయారు చేసి విక్రయిస్తున్నారు. 11 కిలోల ప్యాకెట్‌ను రూ.వెయ్యికి విక్రయిస్తున్నారు. ఇలా తయారు చేసేందుకు ఈ గ్రూపులకు బ్యాంకు లింకేజ్ ద్వారా రుణ సదుపాయాన్ని సైతం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఒక్కో గ్రూపుకు రూ.50 వేలు అందిస్తున్నారు. తాడేపల్లిగూడెం మండలంలో ఐదు, పెంటపాడు మండలంలో ఆరు గ్రూపులకు రుణ సదుపాయం కల్పించారు. ప్యాకింగ్ ద్వారా ఎస్‌హెచ్‌జీ గ్రూపులు కొంత ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇది వారి కుటుంబ అవసరాలకు ఉపకరించనున్నది. తాడేపల్లిగూడెం వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో 650 ఎకరాల్లో ఇలా నవధాన్యాలను వేసి, జీరో కాస్ట్ అగ్రికల్చర్ విధానాన్ని అవలంబిస్తున్నారు.
క్షేత్రసాయిలో విస్తరణకు కృషి
ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న జీరో కాస్ట్ అగ్రికల్చర్ విధానాన్ని త్వరలోనే ఆర్‌బీకేల పరిధిలోకి తీసుకురానున్నారు. ఎస్‌హెచ్‌జీ గ్రూపులు తయారు చేసిన నవధాన్యాల విత్తనాల ప్యాకెట్లను ప్రీ మాన్సున్ డ్రై సోయింగ్ పద్దతి (పీఎండీఎస్) పథకం కింద ఆర్‌బీకేల ద్వారా రైతులకు విక్రయిస్తారు. తద్వారా ప్రకృతి సాగును క్షేత్ర స్థాయిలో విస్తరిస్తారు.
ఇంటింటికీ వెళ్లి అవగాహన
నవధాన్యాలను దుక్కిలో వేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన గడపగడపకు నవధాన్యాలు సారథులు అవగాహన కల్పిస్తారు. గ్రామంలోని సాగు విస్తీర్ణం, రైతుల వివరాలు సేకరించి ఆయా రైతుల ఇళ్లకు వెళ్లి వివరిస్తారు. ఏపీ సీడ్స్, నూజివీడు, ఏలూరు, తణుకు ప్రాంతాల్లో రైతుల వద్ద నుంచి రాష్ట్ర ప్రభుత్వం నవధాన్యాలు విత్తనాలను సేకరిస్తుంది. ఇలా సేకరించిన విత్తనాలను బీజామృతంతో విత్తనశుద్ధి చేసి, రైతులకు సరఫరా చేస్తుంది. ఇప్పటికే వ్యవసాయ, ప్రకృతి వ్యవసాయ విభాగాలు ప్రయోజనాలపై క్షేత్ర స్థాయిలో పరిశోధనలు నిర్వహించింది. మంచి ఫలితాలనివ్వడంతో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందిస్తారు.
పచ్చిరొట్టగా పెంచి చేనులో కలియదున్నడంతో భూసారం పెంపు
ఎరువుల వినియోగ రహిత ప్రకృతి వ్యవసాయమే లక్ష్యం
డ్వాక్రా మహిళలకు ప్రోత్సాహకంగా విత్తనాల విక్రయ బాధ్యతలు
20 నుంచి ఆర్‌బీకేల్లో అందుబాటులో నవధాన్యాల కిట్లు

పచ్చిరొట్ట ఎరువును దుక్కిలో దున్నుతున్న దృశ్యం (ఫైల్)

అలంపురంలోని శ్యామల డ్వాక్రా గ్రూపు మహిళలకు రుణం అందిస్తున్న అధికారులు (ఫైల్)