కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు : ఎమ్మెల్యే రేవూరి | - | Sakshi
Sakshi News home page

కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు : ఎమ్మెల్యే రేవూరి

May 6 2026 7:37 AM | Updated on May 6 2026 7:37 AM

గీసుకొండ: కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. హనుమకొండలోని తన నివాసంలో మంగళవారం నిర్వహించిన గీసుకొండ, సంగెం మండలాలు, డివిజన్ల ముఖ్య నాయకుల సమీక్షలో ఆయన మాట్లాడారు. మండల, గ్రామ కమిటీ పదవులు ఎవరికి వచ్చినా సహకరించాలన్నారు. గీసుకొండ మండల అధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాస్‌, జిల్లా నాయకుడు కొండేటి కొమురారెడ్డి, మండల నాయకులు కూసం రమేశ్‌, పత్తిపాక రవీందర్‌, ఆకుల రుద్రప్రసాద్‌, దూల వెంకటేశ్వర్లు, మణిగోపాల్‌, సంగెం మండల నాయకుడు మాధవరెడ్డి, నరహరి, రమేశ్‌, ఇండ్ల రవి, అచ్చ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

నిబంధనల మేరకు

పనులు చేయాలి : డీపీఓ

పర్వతగిరి: ప్రతీ గ్రామపంచాయతీలో సర్పంచ్‌, పాలకవర్గసభ్యులు, పంచాయతీ కార్యదర్శులు నిబంధనల మేరకు పనులు చేయాలని డీపీఓ కల్పన సూచించారు. ఎంపీడీఓ కార్యాలయంలో అభివృద్ధి పనులపై పర్వతగిరి, వర్ధన్నపేట పంచాయతీ కార్యదర్శులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీఓ కల్పన మాట్లాడుతూ గ్రామ అవసరాలను గుర్తించి నిధుల లభ్యత ప్రకారం, ప్రాధాన్యతా క్రమంలో పనులు చేయాలన్నారు. నిబంధనలు పాటించకుండా చేసిన పనులకు బిల్లులు చెల్లించడానికి వీలుకాదని పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌, పాలకవర్గ సభ్యులకు వివరించారు. డీఎల్‌పీఓ వేదవతి, ఎంపీఓ శేషు, డీపీఎం దివ్య, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

స్పెషల్‌ కలెక్టర్‌గా హనుమానాయక్‌

న్యూశాయంపేట: పరిపాలనా సౌలభ్యం కోసం అదనపు కలెక్టర్లు, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో భాగంగా వరంగల్‌ ఇరిగేషన్‌ అండ్‌ కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ స్పెషల్‌ కలెక్టర్‌గా స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ వి.హనుమానాయక్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, మెనారిటీ గురుకులాల విద్యాసంస్థల్లో (టెమ్రిస్‌) డిప్యుటేషన్‌పై డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ జుబేదున్నీసా బేగంను మహబూబాబాద్‌ డీఆర్‌ఓగా, సిరిసిల్ల ఆర్డీఓగా విధులు నిర్వర్తిస్తున్న స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ సీహెచ్‌ వెంకటేశ్వర్లును జనగామ డీఆర్‌ఓగా, పోస్టింగ్‌ కోసం వెయింటింగ్‌లో ఉన్న స్పెషల్‌గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ బి.వసంతకుమారిని భూపాలపల్లి డీఆర్‌ఓగా, టీఆర్‌ అండ్‌బీ (హౌసింగ్‌)లో డిప్యుటేషన్‌పై స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న కె.శ్రీనివాస్‌ హనుమకొండ డీఆర్‌ఓగా బదిలీ అయ్యారు.

ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం

ఖిలా వరంగల్‌: రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తామని జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్‌ సంధ్యారాణి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కిష్టయ్య తెలిపారు. వర్ధన్నపేట, కట్య్రాల, రాయపర్తి, కొండూరులో ధాన్యం కేంద్రాలను మంగళవారం అధికారులతో కలిసి వారు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జిల్లాలో 227 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

వర్ధన్నపేట: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన ఇల్లంద శివారులో జరిగింది. వర్ధన్నపేట ఎస్సై సాయిబాబు కథనం ప్రకారం వర్ధన్నపేటకు చెందిన మట్టపల్లి సుధాకర్‌ (45) మంగళవారం ఉదయం 5 గంటలకు ఇంటి నుంచి బైక్‌పై ఇల్లంద గ్రామంలో తన బంధువుల ఇంటికి వెళ్తున్నాడు. ఇల్లంద శివారు లక్ష్మి గార్డెన్స్‌ సమీపంలో వరంగల్‌–ఖమ్మం జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లి పోయింది. దీంతో ఆయన బైక్‌పై నుంచి కింద పడి తీవ్రగాయాలపాలయ్యాడు. అటుగా వెళ్తున్న పాలప్యాకెట్లు విక్రయించే వ్యక్తి చూసేసరికి అప్పటికే మృతి చెంది ఉన్నాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. మృతుడికి భార్య అనిత, కుమార్తె మానస, కుమారుడు అరవింద్‌ ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement