లాభసాటిగా వ్యవసాయం | - | Sakshi
Sakshi News home page

లాభసాటిగా వ్యవసాయం

May 5 2026 7:20 AM | Updated on May 5 2026 7:20 AM

గీసుకొండ/నర్సంపేట: రైతులు లాభసాటిగా వ్యవసాయం చేసేందుకు ప్రభుత్వం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతు వారో త్సవాలను నిర్వహిస్తోంది. కార్యక్రమం సోమవా రం ప్రారంభం కాగా ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన, వానాకాలం సాగుకు రైతులను సిద్ధం చేయాలన్నదే వారోత్సవాల ముఖ్యఉద్దేశం. గ్రామం, మండలం, నియోజకవర్గ స్థాయిలో వ్యవసాయం, దాని అనుబంధ శాఖలు వారోత్సవాల్లో భాగం అవుతున్నాయి.

అవగాహన సదస్సులు

జిల్లాలో 11 రూరల్‌ మండలాలు ఉండగా వాటిలో నాలుగైదు గ్రామాలకు ఒకటి చొప్పున మొత్తం 59 వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ప్రతీ క్లస్టర్‌ పరిధిలోని రైతు వేదికలో వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. నర్సంపేటలో నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో ఆ నియోజకవర్గంలోని మండలాలతో పాటు గీసుకొండ, వర్ధన్నపేటలో ఆ నియోజకవర్గ పరిధిలోని మండలాలతో పాటు సంగెం, ఖిలా వరంగల్‌ మండలాల రైతులు పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 1,65,184 మంది రైతులు ఉండగా 2,80,475 ఎకరాల సాగు భూమి ఉందని వ్యవసాయ శాఖ జేడీ అనురాధ తెలిపారు.

వారోత్సవాలు ఇలా..

● తొలిరోజు (సోమవారం) జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వేదికల్లో సమావేశాలను ఏర్పాటు చేసి రైతులకు నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల వాడకం, ప్రకృతి వ్యవసాయం, సన్నరకాల వరి సాగుపై అవగాహన కలిగించడంతోపాటు భూసార పరీక్షలు చేయించుకోవాలని రైతులకు సూచించారు.

● నేడు (మంగళవారం) నియోజకవర్గ స్థాయిలో ఉద్యాన, మత్స్యశాఖలతో పాటు మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తారు. ఉద్యాన పంటల సాగు పెంచడంతో పాటు ప్రత్యామ్నాయ పంటలు, ప్రభుత్వం అందించే సబ్సిడీలు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌పై రైతులకు అవగాహన కలిగిస్తారు.

● ఈనెల 6న (బుధవారం) రైతువేదికల్లో బ్యాంకులు, సహకార సంఘాల ఆధ్వర్యంలో రైతులతో సమావేశాలు నిర్వహిస్తారు. వాటి ద్వారా రైతులకు అందించే పలు రకాల రుణాలను, సేవలను గురించి వివరిస్తారు.

● 7వ తేదీన (గురువారం) నియోజకవర్గస్థాయిలో విద్యుత్‌,రెడ్‌కో శాఖల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తారు. వ్యవసాయ క్షేత్రాల్లో సౌర విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటు, పీఎం కుసుమ్‌ వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్ల వినియోగం, రుణాలపై సబ్సిడీ గురించి వివరిస్తారు.

● 8న (శుక్రవారం) గ్రామ స్థాయిలో పశుసంవర్ధక, మత్స్య, నీటిపారుదల శాఖల ఆధ్వర్యంలో పాడి పరిశ్రమ, పశు జాతి అభివృద్ధి, దూడల ప్రదర్శన, వేసవిలో పశు సంరక్షణకు అవగాహన కలిగిస్తారు. చెరువుల్లో చేపల పెంపకం, రక్షణ, వ్యాధుల నివారణ, మత్స్యసంపద పెరగడానికి సమావేశాలు నిర్వహించి సూచనలు చేస్తారు.

● 9న (శనివారం) గ్రామస్థాయిలో రైతులతో నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి సమర్ధ నీటి విడుదల కోసం గేట్ల నిర్వహణ, ఎత్తిపోతల పథకాల మరమ్మతు కాల్వలు, చెరువుల్లో కంపచెట్లు, గుర్రపుడెక్కల తొలగింపు, సమతుల్య నీటి వినియోగం తదితర అంశాలపై అవగాహన కలిగిస్తారు.

రైతు వారోత్సవాల్లో అవగాహన సదస్సులు

ఈ నెల 9వ తేదీ వరకు నిర్వహణ

క్లస్టర్‌, నియోజకవర్గ, గ్రామ స్థాయిలో సమావేశాలు

జిల్లాలో 1.65 లక్షల మంది రైతులు

2,80,475 ఎకరాల సాగు భూమి

నూతన పద్ధతులను అందిపుచ్చుకోవాలి : కలెక్టర్‌ సత్యశారద

రైతుల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన సాంకేతిక పద్ధతులను అందిపుచ్చుకొని లాభసాటి వ్యవసాయం చేయాలని కలెక్టర్‌ సత్యశారద అన్నారు. సోమవారం కొనాయమాకుల రైతువేదిక వద్ద రైతు వారోత్సవాల ప్రారంభ సమావేశంలో కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతువేదికలు రైతులకు సమాచార మార్పిడి కేంద్రాలుగా ఉపయోపడాలన్నారు. భూ సార పరీక్షల ఆధారంగానే సాగు చేసే పంటల ఎంపిక, అనువైన ఎరువులను వేయాలన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్త ఎ.వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ యూరియాను మోతాదును మించి వాడొద్దని, పచ్చిరొట్ట ఎరువులను వాడాలని సూచించారు. శాస్త్రవేత్త మాధవి మాట్లాడుతూ పంట మార్పిడి పద్ధతులు పాటించాలని, వరిలో మేలైన రకాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ జేడీ అనురాధ మాట్లాడుతూ విచక్షణ రహితంగా రసాయన ఎరువులను వాడొద్దని, సేంద్రియ వ్యవసాయం చేయాలన్నారు. జిల్లా పశువైద్య, పశుసంవర్ధక అధికారి డాక్టర్‌ బాలకృష్ణ, జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాసరావు, మత్స్యశాఖ అధికారి పిల్లి శ్రీపతి, డీసీఓ నీరజ, ఈఈ ప్రశాంతి, తహసీల్దార్‌ రియాజుద్దీన్‌, ఏఓ హరిప్రసాద్‌బాబు, సర్పంచ్‌లు వజ్ర రాజు, తిరుమల్‌రెడ్డి, కూసం స్వరూప, వ్యవసాయ కళాశాల విద్యార్థులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement