భూ హక్కును రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

భూ హక్కును రద్దు చేయాలి

May 5 2026 7:20 AM | Updated on May 5 2026 7:20 AM

న్యూశాయంపేట: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్‌ సత్యశారద తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, సమస్యలను పరిష్కరించిన వాటిని ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు.

ఆర్డీఓ కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ

రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో మొదటిసారిగా నిర్వహించిన ప్రజావాణికి దరఖాస్తులు వచ్చినట్టు కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద తెలిపారు. ప్రజల సౌకర్యార్థం జిల్లా, రెవెన్యూ డివిజన్‌ స్థాయిలోనూ ప్రజావాణిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజావాణికి 101, వరంగల్‌ డివిజన్‌లో 26, నర్సంపేట డివిజన్‌లో 14 దరఖాస్తులు సమర్పించినట్లు వెల్లడించారు. ఇందులో రెవెన్యూ 63, హౌసింగ్‌ 14, జీడబ్ల్యూఎంసీ 18 దరఖాస్తులు రాగా ఇతర శాఖలకు సంబంధించి 46 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవి.గణేశ్‌, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, డీఆర్‌డీఓ నాగపద్మజ, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

వినతులు ఇలా..

● ఆజాంజాహీ మిల్లు కార్మికులకు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం మిల్లు భూముల్లోనే ప్లాట్లు కేటాయించాలి. హనుమకొండ మండలంలోని మడిపల్లిలో కేటాయించిన ప్లాట్లు నివాసయోగ్యంగా లేవు. ప్రత్యామ్నాయ స్థలాన్ని తిరస్కరిస్తున్నామని ఆజాంజాహి మిల్లు కార్మికుల అసోసియేషన్‌ సభ్యులు విన్నవించారు.

● తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన తొలి అమరుడు దొడ్డి కొంరయ్య విగ్రహాన్ని వరంగల్‌ నగరంలోని నాయుడు పంపు కూడలి లేదా ఉర్సుగుట్ట జంక్షన్‌లో ఏర్పాటు చేయాలని కార్పొరేటర్‌ రవి ఆధ్వర్యంలో కురుమ సంఘం నేతలు విన్నవించారు.

ప్రజావాణిలో బైఠాయించిన భూదాత

అనాథాశ్రమానికి పేరు మార్పిడి

చేయాలని డిమాండ్‌

వినతులు త్వరగా పరిష్కరించాలి

కలెక్టర్‌ సత్యశారద

ఆర్డీఓ స్థాయిలోనూ అర్జీల స్వీకరణ

ఈ ఫొటోలో కలెక్టర్‌ ఎదుట నిరసన తెలుపుతున్న భూ దాత వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన గుమ్మడవెల్లి ఉపేంద్రశర్మ. ఈయనకున్న భూమిని ఆప్తమిత్ర మాబడి యజమానికి పాఠశాల నడుపుతామంటే సేవాభావంతో సరస్వతి శిశుమందిర్‌ పేర భూమిని రాసిచ్చాడు. కాని బడిని నడపడం మానేసి తనకు చెప్పకుండా ఆ భూమిని గ్రామపంచాయతీకి దానం చేసినట్టు రాసిచ్చాడు. ఆ భూమి హక్కులను రద్దు చేసి సరస్వతీ శిశుమందిర్‌ లేదా అమ్మానాన్న అనాథశ్రమానికి పేరు మార్పిడి చేయాలని కలెక్టర్‌ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ విషయాన్ని గతంలో ప్రజావాణిలో దరఖాస్తు చేసినా.. అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. కలెక్టర్‌ స్పందించి న్యాయం చేయాలని కోరారు.

పేరు మార్పిడిని రద్దు చేయాలి

తన పేరున నమోదైన ఇంటి నంబర్‌ 5–172ను తనకు తెలియకుండా ఎటువంటి కాగితం లేకుండా తన పెద్ద కుమారుడు గ్రామపంచాయతీలో పేరు మార్పిడి చేసుకున్నారు. దానిని రద్దు చేసి తన పేరున ఇంటినంబర్‌ ఉండేట్లు చర్య తీసుకుని న్యాయం చేయాలి.

– బి.శేషగిరిరావు దంపతులు, గుంటూరుపల్లి, రాయపర్తి

Advertisement
 
Advertisement
Advertisement