రైతుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

రైతుల ఆందోళన

May 5 2026 7:20 AM | Updated on May 5 2026 7:20 AM

నెక్కొండ: ఆరుగాలం పండించిన మక్కల్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే.. నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహించిన రైతులు మక్కల్ని.. కొనండన్నా.. అంటూ ఆందోళనకు దిగారు. సోమవారం నెక్కొండ–నర్సంపేట ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఈ నెల 3న కురిసిన అకాల వర్షంతో తడిసిన మక్కలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నా విషయం తెలుసుకున్న ఎస్సై మహేందర్‌, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిర్వాహకులతో మాట్లాడి కొనుగోళ్లు పూర్తి అయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ధర్నా కారణంగా నెక్కొండ, నర్సంపేట ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచి పోవడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

మంత్రికి ఆహ్వానం

గీసుకొండ: మండలంలోని రాంపూర్‌లో ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు జరగనున్న అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని మంత్రి కొండా సురేఖను దేవస్థానం కమిటీ చైర్మన్‌ తాబేటి వెంకటేశ్వర్లు సోమవారం ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి సంబంధించి వాల్‌ పోస్టర్‌ను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాంపూర్‌ సర్పంచ్‌ రడం భరత్‌కుమార్‌, దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు

నర్సంపేట రూరల్‌: నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో బ్రయోకెమిస్ట్రీ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ కందిమల్ల రమేశ్‌ పేరు గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో నమోదైనట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఆరోగ్యం, కృత్రిమ మేదస్సు అనే సమకాలిన అంశంపై నిర్వహించిన 72 గంటల శిక్షణ, వర్క్‌షాపు కార్యక్రమంలో ఆయన రిసోర్స్‌ ఫ్యాకల్టీ సేవలందించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యరంగంలో కృత్రిమ మేధస్సు వినియోగం, వైద్య డేటా విశ్లేషణ, నిర్ధారణ విధానాల్లో ఏఐ పాత్ర, వైద్య పరిశోధనలో ఏఐ ఉపయోగం, ప్రజారోగ్యనిర్వహణలో ఏఐ అవకాశాలు, నైతిక అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి డాక్టర్‌ రమేశ్‌ పేరు తీసుకొచ్చారని అభినందించారు.

జానపద కళాకారుల

జిల్లా నూతన కమిటీ

నర్సంపేట: పట్టణంలోని వాసవీ కల్యాణ మండపంలో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం జిల్లా సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు వంగ శ్రీనివాస్‌ హాజరై కళాకారుల స్థితిగతులపై చర్చించారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడిగా ఏకాంబ హనుమంతరావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మాదాసి ప్రేమ్‌కుమార్‌, సభ్యులుగా మల్లికంటి వెంకన్న, దన్యాయి కొమురయ్య, గడ్డం సాంబయ్య, యాకయ్యలను ఎన్నుకున్నారు. మహిళా విభాగం అధ్యక్షురాలిగా మాటేటి రజిత, ప్రధాన కార్యదర్శిగా ఉదయగిరి సుకన్య, సభ్యులుగా బానోత్‌ లలిత, తగేరపు సరిత, దాసరి సాంబలక్ష్మిలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి మేకల నారాయణ, రాష్ట్ర కార్యదర్శి తాళ్ల రమేష్‌, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు నిమ్మల రాజు, హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు డబ్బాల్‌ రవి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement