ఖిలా వరంగల్: జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. వరికోతలు ఊపందుకోవడంతో ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఇప్పటికే పలుమార్లు సంబంధిత శాఖల అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో ధాన్యం కొనుగోళ్ల పై సమీక్ష సమావేశం నిర్వహించి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈసారి జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఐకేపీ, ఓడీసీఎంఎస్ ఆధ్వర్యంలో మొత్తం 227 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి, ఖానాపురం, నెక్కొండ మండలాల్లోని 32 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. 1.05 లక్షల ఎకరాల్లో వరి సాగుచేయగా.. 1,190 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 3.30 లక్షల గన్నీ సంచులు, 313 తేమ కొలిచే పరికరాలు రైతులకు అందుబాటులో ఉంచారు. జిల్లాలో శనివారం వరకు 27 కొనుగోలు కేంద్రాల నుంచి 1,300 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.
అఽధికారుల పర్యవేక్షణ..
ధాన్యం కొనుగోళ్లను జిల్లా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, రవాణాశాఖ అధికారి శోభన్‌బాబు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ సంధ్యారాణి, జిల్లా పౌరఫరాల అధికారి కిష్టయ్య, జిల్లా సహకార అధికారి నీరజ, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, మండల వ్యవసాయాధికారులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కేంద్రాల వద్ద రైతులకు కావాల్సిన ఏర్పాట్లు, కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.
అందుబాటులో టార్పాలిన్లు..
రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి మండలల్లో వరికోతలు ప్రారంభమయ్యాయి. ఏ–గ్రేడ్ క్వింటాలు ధర రూ.2,389, సాధారణ రకం బీ–గ్రేడ్ క్వింటాలు ధర 2,369తో కొనుగోలు చేస్తున్నారు. సన్న రకం ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వర్షం వస్తే ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రైతులు వడదెబ్బకు గురికాకుండా షమియానాలు, తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు.
రైతులకు ఇబ్బందులు రానివ్వం
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 227 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇప్పటికే రాయపర్తి మండలం కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయగా.. అదనపు కలెక్టర్ సంధ్యారాణి ప్రారంభించారు. రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నాం. కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేస్తాం. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నాం.
– సంధ్యారాణి,
జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్
ప్రారంభించిన కొనుగోలు కేంద్రాలు : 32
కొనుగోలు చేసింది : 1,300 మె.టన్నులు
అందుబాటులో గన్నీ సంచులు :
3.30 లక్షలు
తేమ కొలిచే పరికరాలు : 313
జిల్లాలో 227 కేంద్రాల ఏర్పాటు
1.05 లక్షల ఎకరాల్లో వరి సాగు
1,190 మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం


