
నానో యూరియాతో అధిక దిగుబడి
నెక్కొండ: పత్తి, మొక్కజొన్న పంటల సాగులో రైతులు సస్యరక్షణ పద్ధతులు పాటించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ సూచించారు. సాయిరెడ్డిపల్లి గ్రామంలో రైతు పెండ్లి మల్లయ్య వ్యవసాయ క్షేత్రంలో బుధవారం ఆ శాఖ ఆధ్వర్యంలో డ్రోన్ యంత్రం ద్వారా పిచికారీ చేశారు. పత్తి, మొక్కజొన్న పంటలపై నానో యూరియా, నానో డీఏపీల స్ప్రే చేయు విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ డ్రోన్ స్ప్రే ద్వారా ఒక ఎకరం పంటను 10 నిమిషాల్లో 10 లీటర్ల నీటితో స్ప్రే చేయవచ్చన్నారు. దీంతో సమయం ఆదా అవుతుందని, కూలీల సమస్య తీరనుందని, ఎరువులు, పురుగుల మందులు, సమానంగా స్ప్రే చేయవచ్చనని ఆమె వివరించారు. నానో యూరియా, నానో డీఏపీని వివిధ పంటల 20 రోజుల దశ, పూతకు ముందుగా స్ప్రే చేయడం ద్వారా మంచి దిగుబడి వస్తుందని ఆమె పేర్కొన్నారు. ఎకరాకు డ్రోన్ స్ప్రే చేయుటకు రూ.400 ఖర్చు అవుతుందన్నారు. ఆసక్తి ఉన్న రైతులు సంబంధిత ఏఈఓ లేదా ఏఓను సంప్రదించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో నర్సంపేట ఏడీఏ దామోదర్‌రెడ్డి, ఏఓ నాగరాజు, ఏఈఓలు, గ్రోమోర్ ప్రతినిధి సజ్జన్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ
డ్రోన్‌తో పిచికారీపై
రైతులకు అవగాహన