
గుడువు దాటిన చెక్కులు వాపస్
కమలాపూర్: గడువుదాటిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను రెవెన్యూ అధికారులు మంగళవారం వాపస్ తీసుకున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చేతుల మీదుగా సోమవారం మండలానికి చెందిన 100 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అందులో పలువురికి గడువు దాటిన చెక్కులు పంపిణీ చేసిన విషయం విదితమే. ‘గడువు దాటిన చెక్కులతో అవాక్కు’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. మండల వ్యాప్తంగా గడువు దాటిన చెక్కులు అందుకున్న 20 మందిని గుర్తించారు. వారి నుంచి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను వాపస్ తీసుకుని, వాటిని రీవ్యాలిడేషన్ కోసం హనుమకొండ ఆర్డీఓ రమేశ్‌కు పంపించినట్లు తెలిపారు. వారం రోజుల్లో లబ్ధిదారులకు రీవ్యాలిడేషన్‌తో కూడిన చెక్కులు అందజేస్తామని, లబ్ధిదారులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని తహసీల్దార్ సురేశ్‌కుమార్ సూచించారు.