
కోళ్లఫాం పనులు నిలిపివేయాలి
దుగ్గొండి: తమ ఆరోగ్యాలకు పెను ప్రమాదంగా మారే కోళ్లఫాంను ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టనిచ్చేది లేదని తొగర్రాయి గ్రామస్తులు శపథం చేశారు. గ్రామ సమీపంలో ఉన్న పౌల్ట్రీఫాంలో నూతనంగా మరో భారీ కోళ్లఫాం నిర్మాణం కోసం సదరు వ్యాపారవేత్త ముగ్గు పోసి పిల్లర్ గుంతలు తీయించాడు. దీంతో గ్రామంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున మంగళవారం పౌల్ట్రీపాంలోకి వెళ్లి పిల్లర్ గుంతలను పూడ్చి వేశారు. అక్కడే ఉన్న పొక్లెయిన్‌ను బయటికి పంపించారు. ఇసుక, కంకర, సిమెంట్ ఇటుకలు తీసుకొచ్చిన ట్రాక్టర్లను వెనక్కి పంపించారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడారు. గ్రామ సమీపంలో కోళ్లఫాం నుంచి వెలువడే దుర్వాసనతో ఇప్పటికే వ్యాధుల బారినపడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ విస్తరిస్తే ఇంకా ఎక్కువ వాసనతో తమ ప్రాణాలకే ముప్పు వస్తుందని పేర్కొన్నారు. నిర్మాణ పనులు ఆపకుంటే ఎంతటి పోరాటాలకై నా సిద్ధమని స్పష్టం చేశారు. జిల్లా ఉన్నతాధికారులు, ఎంపీ, ఎమ్మెల్యేలు స్పందించి పనులు నిలిపివేసి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు రాస చేరాలు, యార శ్రీనివాస్, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు, ఎస్సీ కాలనీవాసులు పాల్గొన్నారు.