
టీచర్లు నైపుణ్యాలు పెంపొందించుకోవాలి..
విద్యారణ్యపురి: ఉపాధ్యాయులు వృత్తిపరంగా విద్యాబోధన నైపుణ్యాలు పెంపొందించుకుని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ పి.రాజీవ్ సూచించారు. వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల ఉపాధ్యాయులకు రెండోదఫా ఐదురోజుల పాటు కొనసాగే శిక్షణ కార్యక్రమం బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో సోమవారం ప్రారంభమైంది. ఈసందర్భంగా శిక్షణ కేంద్రాన్ని రాజీవ్ సందర్శించి ఉపాధ్యాయులకు పలు సూచనలిచ్చారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ సుజన్‌తేజ, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి, హెచ్‌ఎం వెంకటేశ్వర్‌రావు, కోర్సు కో–ఆర్డినేటర్ చలమల నాగేశ్వర్‌రావు, రిసోర్స్‌పర్సన్లు పాల్గొన్నారు.
రైలు కింద పడి ఒకరి మృతి
నెక్కొండ: మండలంలోని రెడ్లవాడకు చెందిన కర్నెకంటి మహేశ్(19) నెక్కొండ రైల్వే స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని రైలు కింద పడి సోమవారం మృతి చెందాడు. వరంగల్ రైల్వే హెడ్ కానిస్టేబుల్ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్ తల్లిదండ్రులు ఐలయ్య–పద్మ కుటుంబం హైదరాబాద్‌లో నివసిస్తోంది. మహేశ్ హైదరాబాద్‌లో హౌస్ కీపింగ్ పనులు చేస్తున్నాడు. కాగా.. మృతుడి తాత యాదగిరి మూడు రోజుల క్రితం మృతి చెందగా.. ఐలయ్య కుటుంబం రెడ్లవాడకు వచ్చింది. ఉదయం హైదరాబాద్‌కు వెళ్లేందుకు వచ్చి పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో మహేశ్ తల పగిలి, కాళ్లు, చేతులు విరిగాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సుదర్శన్ తెలిపారు. అనంతరం మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ముగిసిన
వేసవి శిక్షణ శిబిరం
గీసుకొండ: మండలంలోని వంచనగిరిలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో వివిధ అంశాల్లో విద్యార్థులకు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి వేసవి శిక్షణ శిబిరం సోమవారం ముగిసింది. ఈముగింపు కార్యక్రమానికి డీఈఓ జ్ఞానేశ్వర్ హాజరై విద్యార్థుల ప్రదర్శనలు వీక్షించి ఆనందం వ్యక్తం చేశారు. శిక్షణ శిబిరంలో జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో చదువుతున్న సుమారు వంద మంది విద్యార్థులకు 15 రోజుల పాటు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జీసీడీఓ ఫ్లారెన్సా, పాఠశాల ప్రత్యేకాధికారి హిమబిందు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
సైన్స్ కోర్సు, పీహెచ్‌డీ
తరగతుల పరిశీలన
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని సైన్స్ విభాగాల పరిశోధకుల ప్రీ పీహెచ్‌డీ కోర్సు వర్క్‌లో భాగంగా క్యాంపస్‌లోని గణితశాస్త్ర విభాగం సెమినార్ హాల్‌లో నిర్వహిస్తున్న కామన్ టాపిక్స్ తరగతుల నిర్వహణను కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం సోమవారం పరిశీలించారు. రీసెర్చ్ మెట్రిక్స్, ప్లగరిజం, టెక్నికల్ రిపోర్ట్ రైటింగ్ వంటి పలు అంశాలపై ఈనెల 31వ తేదీ వరకు తరగతులు కొనసాగుతాయని ఆ విభాగాధిపతి అసిస్టెంట్ ప్రొఫెసర్ భారవీశర్మ తెలిపారు. రిజిస్ట్రా ర్ వెంట ఓఎస్‌డీ ప్రొఫెసర్ మల్లారెడ్డి, ప్లగరిజం డైరెక్టర్ ఎల్‌పీ.రాజ్‌కుమార్ ఉన్నారు.
23న జాబ్ మేళా
హన్మకొండ అర్బన్: నిరుద్యోగులకు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 23న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం.మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీలో వరంగల్, హనుమకొండలో సేల్స్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి 20 మందిని ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ పూర్తి బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో శుక్రవారం ఉదయం ములుగు రోడ్డు ఐటీఐ క్యాంపస్‌లోని జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో హాజరు కావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 78933 94393 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.

టీచర్లు నైపుణ్యాలు పెంపొందించుకోవాలి..

టీచర్లు నైపుణ్యాలు పెంపొందించుకోవాలి..