
రాష్ట్రస్థాయి పోటీలకు మొండ్రాయి విద్యార్థులు
సంగెం: రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర సాఫ్ట్‌బాల్ పోటీలకు మొండ్రాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయురాలు కె.విజయ, పీడీ ముఖర్జీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 30న ఓ సిటీలో వరంగల్ జిల్లాస్థాయి జూనియర్ సాఫ్ట్‌బాల్ సెలక్షన్స్ పోటీల్లో విద్యార్థులు పి.ప్రణయ్‌వర్ధన్, డి.వర్షిత్ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీల కు ఎంపికై నట్లు పేర్కొన్నారు. ఈనెల 19 నుంచి 21వ వరకు మెదక్ జిల్లా తూప్రాన్‌లో జరుగనున్న 11వ రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో విద్యార్థులు పాల్గొంటున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను ఎస్‌ఎంసీ చైర్‌పర్సన్ శ్రీలత, పాఠశాల హెచ్‌ఎం విజయ, పీడీ ముఖర్జీ, ఉపాధ్యాయులు అభినందించారు.
కల్లెడలో జామాయిల్ తోట దగ్ధం
పర్వతగిరి: కల్లెడ గ్రామ శివారులోని కరిమిళ్ల సోమేశ్వరరావు, ఎన్నమనేని మోహన్‌రావుకు చెందిన జామాయిల్ తోట నిప్పంటుకొని ఆదివారం దగ్ధమైంది. జామాయిల్ తోట పక్కన ఉన్న పొలంలో రైతు వరి కొయ్యలను అంటు పెట్టాడు. దీంతో పక్కన ఉన్న జామాయిల్ తోటకు మంటలు వ్యాపించడంతో దగ్ధమైంది. 15 ఎకరాల్లో 12 ఎకరాల జామాయిల్ తోట పూర్తిగా కాలిపోయింది. సుమారు రూ.30 లక్షల వరకు నష్టం జరిగిందని రైతులు తెలిపారు.
రేపటి నుంచి
పీజీ కోర్సుల పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో పీజీ కోర్సుల నాలుగో సెమిస్టర్( నాన్ ప్రొఫెషనల్ )రెగ్యులర్, ఎక్స్,ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు ఈనెల 20 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సౌజన్య ఆదివారం తెలిపారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్‌ఆర్‌ఎం, జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ తదితర కోర్సుల పరీక్షలు నిర్వహించనున్నారు. ఈనెల 20, 22, 24, 27, 29, 31 తేదీల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. కాకతీయ యూని వర్సిటీలో పరిధిలో పీజీ కోర్సుల పరీక్షల నిర్వహణకు 26 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4,300 మంది పరీక్షలు రాయనున్నట్లు వారు తెలిపారు.
డైక్ కాంట్రాక్ట్ సిబ్బంది ఇష్టారాజ్యం
ఎంజీఎం: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (డైక్)లో కాంట్రాక్ట్ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొద్ది నెలల నుంచి సిబ్బంది అసలు విధుల్లో లేకుండానే విధులకు హాజరైనట్లు అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేస్తున్నారు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏకంగా విధులకు హాజరవ్వకుండా డైక్ సెంటర్‌కే తాళం వేసిన ఘటనలున్నట్లు బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. సిబ్బంది విధులకు డుమ్మా కొడుతుండడంతో బాధిత పిల్లలకు సేవలు ఎలా అందిస్తారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డైక్ సెంటర్ కాంట్రాక్ట్ సిబ్బందిలో ఓ ఉద్యోగిని ఎవరైనా ప్రశ్నిస్తే.. ప్రముఖ దినపత్రిక చీఫ్ బ్యూరో నా చుట్టం.. మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటూ.. చిందులు తొక్కుతుండడం గమనార్హం. ఎంజీఎం డైక్ సెంటర్‌లో అర్హత లేని వ్యక్తులు ఉద్యోగాలు పొందారని, నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగ నియామకాలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డైక్ సెంటర్ కాంట్రాక్టు సిబ్బంది తీరు, నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగ నియామకాలపై కలెక్టర్ విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించాలంటూ ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.