
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలి
ఎల్కతుర్తి: వర్షాకాలానికి ముందే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య లబ్ధిదారులకు సూచించారు. మండల కేంద్రంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం, వీరనారాయణపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను గురువారం ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో మొత్తం 95 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. 35 ఇళ్ల పనులు జరుగుతున్నట్లు తెలిపారు. కొంతమంది లబ్ధిదారులకు మొదటి విడత నగదు ఇచ్చామని, ఆర్థిక సమస్యలు ఉన్నవారు సైతం త్వరగా ఇంటి నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. అన్ని గ్రామాల్లో మంత్రి చేతుల మీదుగా పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరాయని, జిల్లాలో ఇప్పటి వరకు 80వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రైతులకు రూ.150 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. మరో రెండు వారాల్లో మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్, సివిల్ సప్లయీస్ అధికారి మహేందర్, డీసీఎస్‌ఓ కొమురయ్య, ఎంపీడీఓ విజయ్‌కుమార్, ఎంపీఓ రవిబాబు, ఏపీఎం రవీందర్ పాల్గొన్నారు.
ఆంగ్ల నైపుణ్యాలు పెంపొందించాలి
హసన్‌పర్తి: విద్యార్థుల్లో ఆంగ్ల నైపుణ్యాలు పెంపొందించాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. భీమారంలోని స్కిల్ స్ట్రోక్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని గురువారం ఆమె సందర్శించారు. శిక్షణ గురించి జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతిని అడిగి తెలుసుకున్నారు. సబ్జెక్ట్‌ల వారీగా శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులతో కొంతసేపు ముచ్చటించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అధునాతన బోధనా పద్ధతులు, 21వ శతాబ్దపు శిక్షణతో బోధనలో మెళుకువలు పాటించాలని సూచించారు. ప్రభుత్వం బైలింగ్వల్ ద్విభాష పాఠ్యపుస్తకాలు అందిస్తోందని ఆమె వివరించారు. తరగతి గది డిజిటలైజేషన్ కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలని, విద్యార్థుల ప్రవర్తన ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, నైతిక విలువలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో గుణాత్మక విద్య సమన్వయకులు శ్రీనివాస్, సమ్మిళిత విద్య కోఆర్డినేటర్ సుదర్శన్‌రెడ్డి, సెంటర్ ఇన్‌చార్జ్‌లు, రిసోర్స్‌పర్సన్ తదితరులు పాల్గొన్నారు.
సివిల్స్ ప్రిలిమినరీకి ఏర్పాట్లు
విద్యారణ్యపురి: జిల్లాలో ఈనెల 25న నిర్వహించనున్న యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా పరిధిలో 4,141మంది అభ్యర్థులకు 10 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఉదయం మొదటి సెషన్ 9–30 నుంచి 11–30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2–30 నుంచి సాయంత్రం 4–30 గంటల వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు అర్ధగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, అడ్మిట్ కార్డు, పెన్ను, పెన్సిల్ వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఆర్టీసీ బస్సులు ఉదయం 7 గంటల నుంచే నడుపుతారని తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్, హనుమకొండ ఏసీపీ దేవేందర్‌రెడ్డి, డీఈఓ డివాసంతి, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ మధుసూదన్, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రావీణ్య