
మహిళా డెయిరీ ఏర్పాటుతో ఆర్థికాభివృద్ధి
ఎల్కతుర్తి: పరకాల నియోజకవర్గం దామెర మండలంలో మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు కొత్తగా మహిళా డెయిరీని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ మహిళా సొసైటీలో పరకాల నియోజకవర్గంలోని మహిళా రైతులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమానికి మంగళవారం హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు పి.ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ముల్కనూర్ సొసైటీ ద్వారా పాడి రంగంలో మహిళలు ఏ విధంగా అభివృద్ధి సాధిస్తున్నారనే వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. మహిళా రైతులకు అందజేస్తున్న శిక్షణ కార్యక్రమాలను నిర్వాహకులు ఎమ్మెల్యే రేవూరికి, కలెక్టర్లకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పరకాల నియోజకవర్గంలోని ఆరు మండల్లాల్లో మహిళా రైతులతో డెయిరీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు గాను 53 కోఆపరేటివ్ సంఘాలను రిజిస్ట్రేషన్ చేయించామని వెల్లడించారు. డెయిరీని విజయవంతంగా నిర్వహించేందుకు ముల్కనూర్ డెయిరీ ద్వారా శిక్షణ అందజేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే దామెర మండలంలో డెయిరీ ఏర్పాటు చేస్తున్నట్లు, దీంతో మహిళలకు ఉపాధి లభిస్తుందన్నారు. ఇందుకోసం ఆరు మండలాల్లో పాడి పశువులు, పాల దిగుబడుల సర్వే పూర్తయినట్లు వివరించారు. కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల గ్రామీణ అభివృద్ధి అధికారులు మేన శ్రీను, కౌసల్యదేవి, మహిళా డెయిరీ అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ, డెయిరీ జీఎం భాస్కర్‌రెడ్డి, ఇతర అధికారులు, మహిళా రైతులు, తదితరులు పాల్గొన్నారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
ముల్కనూర్ డెయిరీని సందర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్లు