
స్వల్పంగా తగ్గిన భూగర్భజలం
సాక్షి, వరంగల్: జిల్లాలో భూగర్భ జలమట్టం కొద్దికొద్దిగా దిగువకు వెళ్తోంది. గతేడాది ఏప్రిల్‌లో (సగటు 6.31 మిమీలు)తో పొల్చుకుంటే ఈఏడాది 6.21 మిమీలు అంటే.. మరో పది మిల్లీ మీటర్లు తక్కువగా పడిపోయింది. అదే సమయంలో ఫిబ్రవరిలో సగటు 5.66 మీటర్లుంటే మార్చిలో 6.32 మీటర్లు, ఏప్రిల్‌లో 6.21 మీటర్లుగా ఉంది. అయితే ఇప్పటికే వరి కోతలు పూర్తవడంతో, మే నెలలో సాగు నీటి వాడకం తక్కువగా ఉండడంతో తాగునీటికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని భూగర్భజల విభాగాధికారులు అంటున్నారు. ఓ వైపు సూర్యుడి ప్రతాపం 42 నుంచి 45 డిగ్రీ సెల్సియస్ వరకు నమోదవుతుంటే, ఇంకోవైపు స్వల్పంగా భూగర్భజలమట్టం తగ్గుతోంది. వందల ఎకరాల్లో కూరగాయల సాగు మినహా పెద్దగా పంటలు లేవని అందుకే నీటి మట్టం అధిక స్థాయిలో తగ్గడం లేదని అఽధికారులు చెబుతున్నారు. అదే సమయంలో ఎస్సారెస్పీ కెనాల్ నీటి ద్వారా వందల చెరువులు, కుంటలు నింపడం వల్ల చాలాచోట్ల నీటి నిల్వలు ఉన్నాయి. జిల్లాలో నీటికి పెద్దగా ఇబ్బంది లేకపోయినా.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పొదుపుగా వినియోగించాల్సిన అవసరముందని అధికారులు కోరుతున్నారు.
ఎస్పారెస్పీ కాల్వల ద్వారా
నీరు రావడంతో కాస్త ఊరట
నీటిని పొదుపుగా వాడుకోవాలంటున్న అధికారులు
ఆ రెండు మండలాల్లో పెరుగుదల..
మైలారం రిజర్వాయర్ నుంచి వదిలిన నీరు రాయపర్తి మండలంలోని వివిధ గ్రామాలకు అనుసంధానంగా ఉన్న ఎస్సారెస్పీ ఉపకాల్వల ద్వారా చెరువులు, కుంటలకు చేరుతోంది. దీంతో అక్కడ భూగర్భజలమట్టం పెరిగింది. రాయపర్తి మండలంలో ఫిబ్రవరిలో 8.25 మీటర్లు ఉంటే మార్చిలో 9.82 మీటర్లకు పడిపోయింది. అదే ఏప్రిల్‌లో 4.8 మీటర్లు ఎగబాకి 5.02 మీటర్లకు నీరు చేరుకుంది. పర్వతగిరిలోనూ కాల్వల ద్వారా వచ్చిన నీటితో అక్కడి ప్రధాన చెరువులు, కుంటలు నింపారు. ఫలితంగా ఫిబ్రవరిలో 11.80 మీటర్ల దిగువన నీరు ఉంటే మార్చిలో 14.74 మీటర్లకు దిగువకు చేరి ప్రమాద ఘంటికలు మోగించాయి. అయితే కాల్వ ల ద్వారా నీరు రావడంతో నీటిమట్టం 12.83 మీటర్లకు చేరుకుంది. ఇంకా మిగిలిన మండలాల్లో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల మధ్య పాయింట్ల తేడా ఉండడం గమనార్హం.