
విద్యారణ్యపురి/కాళోజీ సెంటర్ : ఇంటర్‌సెకండియర్ పరీక్షలు బుధవారం ముగిశాయి. హనుమకొండ జిల్లాలో చివరిరోజు పరీక్షలకు జనరల్, ఒకేషనల్ కోర్సులు కలిపి 15,238మందికి 14,801మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరుకాగా 437మంది గైర్హాజరయ్యారని డీఐఈఓ గోపాల్ తెలిపారు. వరంగల్ జిల్లాలో 6,522 మంది విద్యార్థులకు 6,225మంది హాజరుకాగా, 297మంది గైర్హాజరయ్యారని డీఐఈఓ కాక మాధవరావు తెలిపారు. పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. తల్లిదండ్రులు తమ పిల్లలను దగ్గరుండి ఇంటికి తీసుకెళ్లారు.
సీతారాముల కల్యాణానికి
ఏర్పాట్లు పూర్తి
హన్మకొండ కల్చరల్ : నగరంలోని వివిధ ఆలయాల్లో గురువారం జరగనున్న శ్రీసీతారామచంద్రస్వామిల కల్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పలు దేవాలయాల్లో కల్యాణం నిర్వహించడానికి షామీయానాలు, పందిళ్లు వేసి మామిడి తోరణాలు, విద్యుత్‌దీపాలతో ముస్తాబు చేశారు. వేయిస్తంభాల గుడిలో ఉదయం 10గంటల నుంచి కల్యాణతంతు ప్రారంభమవుతుందని ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ, ఈఓ వెంకటయ్య తెలిపారు. వరంగల్ ఎల్లంబజార్‌లోని శ్రీసీతారామచంద్రస్వామి వారి అలయం, శివనగర్‌లోని సీతారామచంద్రస్వామి ఆలయం, ఓ సిటీలోని శ్రీసీతారామాంజనేయ లక్ష్మీగణపతి అయ్యప్పస్వామి దేవాలయం, హనుమకొండలోని చిన్నకొవెల, రెవెన్యూ కాలనీ, ఎకై ్సజ్ కాలనీలోని ఆలయాల్లో కల్యాణోత్సవాలు జరగనున్నాయి.