
వరంగల్‌లో ఇరుకుగా ఉన్న రాధిక టాకీస్ పక్కనున్న బందల్‌శెట్టి గల్లీ
నరకం చూపిస్తున్న
నగర రహదారులు
● విస్తరణ లేక.. అభివృద్ధికి దూరంగా..
● ఇష్టారాజ్యం నిర్మాణాలతో
ప్రజలు ఇబ్బందులు
● ఆక్రమించి కట్టడాలు చేపడుతున్నా పట్టించుకోని బల్దియా అధికారులు
వరంగల్ అర్బన్: నగరంలోని రహదారులపై ప్రయాణించాలంటే ప్రజలు సతమతమవుతున్నారు. ఇరుకు రోడ్లపై నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుండటం వల్ల కార్యాలయాలకు, వివిధ పనుల నిమిత్తం వెళ్లేవారు ఆందోళనకు గురవుతున్నారు. కీలక ప్రధాన రహదారుల్లోనే కాకుండా.. అంతర్గత రోడ్లపై మూడేళ్లుగా ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతున్నా ప్రభుత్వ శాఖల అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
కొత్త మాస్టర్ ప్లాన్ అమలు..
నగర దశ, దిశను మార్చే బృహత్తర మాస్టర్ ప్లాన్–2041కు సీఎం ఆమోదముద్ర పడలేదు. కానీ.. ఐదేళ్లుగా క్షేత్రస్థాయిలో ఆ ప్రణాళిక అమలవుతోంది. గతంలో 20 అడుగుల రోడ్లు కలిగి ఉన్న భవనాలకు నిర్మాణ ధ్రువీకరణ అనుమతి పత్రాలు జారీ అయ్యాయి. కొత్త మాస్టర్ ప్లాన్ అమలుతో ముందుచూపుగా 2018లో బల్దియా కమిషనర్‌గా గౌతమ్ ఉన్నప్పుడు రోడ్డు వెడల్పు 30 అడుగులతో అనుమతుల నిబంధన అమలు చేశారు. దీంతో కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్ల వెంట అనుమతులు జారీ అవుతున్నాయి.
పెరుగుతున్న జనాభా, వాహనాలు
నగరంలో 11లక్షల మంది జనాభా ఉండగా.. రోజు వివిధ పనుల నిత్యం 2 లక్షల మంది వచ్చిపోతుంటారు. పెద్ద, చిన్నా రోడ్లు 2,500 కిలోమీటర్ల మేర ఉన్నాయి. మూడేళ్ల ముందున్న వాహనాల కంటే కరోనా వైరస్ పుణ్యమా అని అవి రెట్టింపయ్యాయి. జనాభా మేరకు వాహనాలున్నా.. ఆ ప్రకారం రహదారులు మాత్రం లేవు. కొన్ని రోడ్లు దుర్భరంగా ఉన్నాయి. మాస్టర్ ప్లాన్ ప్రకారం 30, 50, 60, 80, 100, 150 అడుగుల మేర భవన నిర్మాణాలకు అనుమతులు జారీ చేస్తున్నారు. నిర్మాణాలు జరిగే క్రమంలో ఎంత మేరకు నిబంధనలకు లోబడి నిర్మిస్తున్నారనే విషయాలను బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. సెట్ బ్యాక్‌లు, పార్కింగ్, సెల్లార్ వదిలిపెట్టకుండా ప్లాన్‌లను పక్కన పెట్టి నిర్మాణాలను ఇష్టారాజ్యంగా చేపడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
Ì వరంగల్‌లో ఉదయం 8.30 గంటలకు కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లేందుకు కొత్తవాడలోని రాము తన ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయలుదేరాడు. పోచమ్మమైదాన్‌లో రోడ్డు ఏదో కార్యక్రమంతో బ్లాక్ అయింది. మండిబజార్, ఎల్బీ నగర్ మీదుగా వెళ్లాలి. ఆ ఇరుకు రోడ్లు వాహనాలతో నిండిపోయాయి. ఏముంది రైలు వెళ్లిపోవడంతో అసహనానికి గురయ్యాడు.
Ì వరంగల్ చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో జరిగితే వాహనదారులు ప్రత్యామ్నాయ రహదారిని వెతుక్కుంటారు. ఆ రోడ్లు విస్తరణ, అభివృద్ధికి నోచుకోక వాహనదారులు, డ్రైవర్లు, ప్రయాణికులు ఎక్కువగా నరకయాతన అనుభవిస్తున్నారు.
Ì ఇలా ట్రైసిటీలోని అనేక రహదారులకు ప్రత్యామ్నాయం లేక, అంతర్గత రోడ్ల విస్తరణ, అభివృద్ధి లేక నగరవాసులు సతమతమవుతున్నారు.