
నిందితుడి అరెస్టు చూపుతున్న ఈస్ట్ జోన్ డీసీపీ
వరంగల్ క్రైం: సొంత అన్న ఇంట్లో చోరీకి పాల్పడిన తమ్ముడిని 24 గంటల్లోపు చెన్నారావుపేట పోలీసులు అరెస్టు చేసి 75 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1.40లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఈస్ట్‌జోన్ డీసీపీ పుల్లా కరుణాకర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కోనాపురం గ్రామానికి చెందిన మండల రవి రోజువారీ కూలీ చేస్తూ వచ్చిన డబ్బులతో మద్యం సేవించి జల్సాలకు అలవాటుపడ్డాడు. అప్పులు అధికమవడంతో ఎలాంటి పనులు చేయకుండా కేవలం మద్యం సేవిస్తూ కాలం గడుపుతున్నాడు. అప్పు చేసిన చోట ఒత్తిళ్లు పెరగడంతో సులభంగా డబ్బులు సంపాదించాలని రవి ప్రణాళిక రూపొందించుకున్నాడు. రవి తన అన్న సుధాకర్ కుమారుడి వివాహం ఇటీవల కావడంతో ఇంట్లో ఎక్కువ డబ్బులతోపాటు బంగారు ఆభరణాలు ఉన్నాయని భావించి చోరీ చేసేందుకు సిద్ధపడ్డాడు. ఈనెల 26న సుధాకర్ కుటుంబ సభ్యులు వేములవాడకు వెళ్లడాన్ని గమనించి ఇంట్లోకి దూరి బంగారు ఆభరణాలు, డబ్బును చోరీ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నెక్కొండ ఇన్‌స్పెక్టర్ హతీరాం విచారణ చేశారు. విచారణలో ఫిర్యాదుదారుడి తమ్ముడిపై అనుమానంతో అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకొని తన అన్న ఇంట్లో తమ్ముడే చోరీకి పాల్ప డినట్లుగా నిర్ధారించిన పోలీసులు నిందితుడిపై నిఘా పెట్టారు. మంగళవారం చోరీ సొత్తులో కొంత డబ్బును తీసుకునేందుకు నిందితుడు ఇంటికి రావడంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన నర్సంపేట ఏసీపీ సంపత్‌రావు, నెక్కొండ ఇన్‌స్పెక్టర్ హతీరాం, చెన్నారావుపేట ఎస్సై టి.మహేందర్, కానిస్టేబుల్ కత్తి సురేశ్, సిబ్బందిని డీసీపీ అభినందించారు.
75 గ్రాముల బంగారం
రూ.1.40లక్షల నగదు స్వాధీనం
నిందితుని అరెస్టు చూపిన ఈస్ట్‌జోన్ డీసీపీ కరుణాకర్