
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ కీర్తినగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్(యూపీహెచ్‌సీ)లో నిర్వహిస్తున్న మహిళా ఆరోగ్య క్లినిక్‌ను కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె.వెంకటరమణ కలెక్టర్ వెంట రాగా.. క్లినిక్‌లో మహిళలకు అందిస్తున్న వైద్య సేవలను ఆమెకు వివరించారు. ప్రతీ మంగళవారం జిల్లాలో ఐదు మహిళా క్లినిక్‌ల ద్వారా సేవలు అందిస్తున్నామని, వాటిలో లేని వైద్య సేవలను నగరంలోని ఎంజీఎం ఆస్పత్రి, నర్సంపేట సీహెచ్‌సీల్లో పొందే అవకాశం ఉందని డీఎంహెచ్‌ఓ తెలిపారు. కార్యక్రమంలో యూపీహెచ్‌సీ వైద్యాధికారి అర్చన, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
నేడు వ్యవసాయ
సంక్షోభంపై సదస్సు
గీసుకొండ: మండలంలోని కొనాయమాకుల సమీపంలో గల ఓంకార్ గార్డెన్స్‌లో బుధవారం ‘సంక్షోభంలో భారత వ్యవసాయరంగం–పరిష్కారాలు, మార్గాలు, ప్రభుత్వాల బాధ్యత, మన కర్తవ్యం’ అనే అంశంపై ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి సదస్సును ఏర్పాటు చేసినట్లు తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. సదస్సులో మేధావులు, వ్యవసాయరంగ నిపుణులు, రైతు సంఘాల నాయకులు పాల్గొంటారని, రైతులు అధికంగా పాల్గొనాలని కోరారు.
‘49 కిలోలకు
మించకుండా తేవాలి’
వరంగల్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు విక్రయానికి తరలించే సరుకును 25 కిలోలకు తగ్గకుండా.. 49 కిలోలకు మించకుండా తేవాలని మార్కెట్ చైర్‌పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి రైతులకు సూచించారు. మంగళవారం వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డితో కలిసి మిర్చి యార్డులోని రైతులకు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని యార్డుల్లోని రైతులకు కరపత్రాలను పంపిణీ చేయడంతోపాటు ఫ్లెక్సీలను ప్రదర్శించి.. వారికి అవగాహన కల్పించాలని అన్నారు. అలాగే ఉమ్మడి వరంగల్‌లోని జిల్లా వ్యవసాయాధికారులకు, మండల స్థాయిలోని ఏఈఓల ద్వారా గ్రామాల్లో పంపిణీ చేసేందుకు ప్రతీ జిల్లాకు కరపత్రాలను సరఫరా చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉన్నత శ్రేణి కార్యదర్శి బీవీ.రాహుల్, గ్రేడ్–2 కార్యదర్శులు చందర్‌రావు, ఎండి.బియబానీ, మార్కెట్ కమిటీ ఉద్యోగులు పాల్గొన్నారు.
వందశాతం ఉత్తీర్ణతే
లక్ష్యంగా చదవాలి
రాయపర్తి: పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పట్టుదలతో ఇష్టపడి చదవాలని జిల్లా సెక్టోరియల్ ఆఫీసర్, జీసీడీఓ కుడికాల సుభాష్ అన్నారు. తిర్మలాయపల్లి గ్రామంలోని కస్తూర్బాగాంధీ బాలికల వసతి గృహాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని భోజనం, గదులు, డార్మెటరీ, స్టాక్, వసతులను పరిశీలించారు. అనంతరం పదో తరగతి విద్యార్థినుల విద్యా సామర్థ్యాలను అడిగి తెలు సుకున్నారు. కార్యక్రమంలో స్పెషలాఫీసర్ బుర్ర కవిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

