యువతే లక్ష్యం.. గంజాయి విక్రయం

గంజాయి ముఠాను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ అధికారులు(ఫైల్‌) - Sakshi

జిల్లాలో పట్టుకున్న గంజాయి వివరాలిలా...

ఉన్నత విద్యాసంస్థలు,

బెల్ట్‌ షాపులే అడ్డాలు

విద్యార్థులు, యువతకు అమ్మేందుకు

సీక్రెట్‌ కోడ్‌లు

తనిఖీలు ముమ్మరం చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

నిత్యం ఏదో ఒకచోట పట్టుబడుతున్న వైనం

సంవత్సరం పట్టుబడింది(కిలోల్లో..)

2007 47

2019 44

2020 45

2021 11

2022 595

నర్సంపేట: విద్యాసంస్థలు, విద్యార్థులు, యువతే లక్ష్యం. గంజాయి విక్రయమే వారి వ్యాపారం. టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ప్రత్యేక నిఘాతో కట్టడి చేస్తున్నా.. నిత్యం ఎక్కడో ఒకచోట ముఠాలు పట్టుబడటం. సీక్రెట్‌ కోడ్‌ ఆధారంగా ఉన్నత విద్యాసంస్థలు, బెల్టు షాపులను అడ్డాగా చేసుకుని అమ్మకం. నర్సంపేటలో గంజాయి సాగు లేకపోయినా ఘాటు మాత్రం గుప్పుమంటోంది. జిల్లాలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 16 చోట్ల ఎండు గంజాయిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. 48 మందిని అరెస్ట్‌ చేసి.. వారి వద్ద నుంచి 276 కేజీల శుద్ధి చేసిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నత విద్యాసంస్థలు ఉన్నాయి. ఈ క్రమంలోనే గంజాయి విక్రయాలు పెరుగుతున్నాయి. గతంలో ఈ ప్రాంతంలో గంజాయి సాగు ఎక్కువగా ఉండటం, దానిని సేవించడం వల్ల ఎదురయ్యే అనర్థాలపై పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పించడంతో సాగు తగ్గుముఖం పట్టింది. అయితే ఇతర ప్రాంతాల నుంచి ఎండు గంజాయిని తెచ్చి ఇక్కడ విక్రయించడం పరిపాటిగా మారింది. జిల్లాలోని నర్సంపేటతోపాటు వరంగల్‌, వర్ధన్నపేట పట్టణాల్లో యువత గంజాయిని సేవించే సంస్కృతి పెరిగింది. గంజాయి విక్రయదారులు విద్యార్థులు, యువతే లక్ష్యంగా అడ్డాలను ఏర్పాటు చేసుకోగా.. అదే స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టడం.. నిరంతరం తనిఖీలు చేయడం సత్ఫలితాలిస్తోంది.

రూటు మార్చిన ముఠా..

ఇదే క్రమంలో భద్రాచలం నుంచి డీసీఎం వాహనం ఖానాపురం మీదుగా వరంగల్‌కు వెళ్తున్న క్రమంలో బోల్తా పడింది. దీంతో అందులో గంజాయి రవాణా అవుతున్నట్లు బయటపడింది. గతంలో భద్రాచలం, ఖమ్మం, ఇతర ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఎండు గంజాయిని పెద్ద వాహనాల్లో వరంగల్‌కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. దీంతో నర్సంపేటలో పట్టుకున్న కేసులో ద్విచక్ర వాహనాన్ని ఉపయోగించడం చూస్తే విక్రయ ముఠా గంజాయిని తరలించే విధానాన్ని మార్చినట్లు తెలుస్తోంది. ఈనెల 23న నర్సంపేటలోని మాధన్నపేట రోడ్డు సమీపంలో ఉన్న శ్మశాన వాటికలో ఇద్దరు యువకులు మూడు కిలోల 200 గ్రాముల ఎండు గంజాయిని ప్యాకెట్లు చేసి సరఫరా చేసేందుకు సిద్ధం చేయగా.. టాస్క్‌ఫోర్స్‌ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు.

సీక్రెట్‌ కోడ్‌లు..

ఎండు గంజాయిని విక్రయించేందుకు యువతను లక్ష్యంగా చేసుకుని ముఠాలు సీక్రెట్‌ కోడ్‌లు కూడా ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. విద్యాలయాల సమీపంలో, బెల్ట్‌ షాపుల వద్ద గంజాయిని విక్రయిస్తుండడంతో విద్యార్థులపై ప్రభావం పడుతుంది. రాత్రి సమయాల్లో విద్యార్థులు చిత్తుబొత్తు ఆటలను కూడా ఏర్పాటు చేసుకుని గంజాయి సేవించడంతో గతంలో ఘర్షణలు జరగగా.. నర్సంపేట పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రధాన రహదారుల వెంట ఉన్న బెల్ట్‌ షాపులపై పోలీసులు గంజాయి విక్రయాల విషయంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

ప్రత్యేక నిఘా పెట్టాం..

గంజాయి విక్రయాలపై జిల్లాలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కువగా యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయాలకు ముఠా పాల్పడుతోంది. ఉన్నత విద్యాలయాల్లో విద్యనభ్యసించే విద్యార్థుల్లో మార్పు కనిపిస్తే విద్యాసంస్థల బాధ్యులు తల్లిదండ్రులకు తెలియజేయాలి. గంజాయి సేవించినా, అమ్మినా ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటాం.

– జితేందర్‌రెడ్డి, టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ

Read latest Warangal News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top