
వరంగల్‌లోని నాయుడు పెట్రోల్ పంపు సమీపంలో రోడ్డు నిర్మించే ప్రాంతం
సాక్షి, వరంగల్: జంట నగరాలపై ట్రాఫిక్ రద్దీ లేకుండా ఉండేందుకు ఉద్దేశించిన ఇన్నర్ రింగ్ రోడ్డు(ఐఆర్‌ఆర్)కు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) గ్రహణం పట్టుకుంది. తొలిదశలో వరంగల్‌లోని నాయుడు పెట్రోల్ బంక్ నుంచి ఏనుమాముల వరకు 8 కిలోమీటర్ల మేర 200 ఫీట్ల రహదారి నిర్మించాలనుకున్నారు. అయితే భూసేకరణకు సంబంధించి పరిహారం విషయంలో ఇంకా అక్కడక్కడా చిక్కులొస్తున్నాయి. భూసేకరణకు హనుమకొండ ఆర్డీఓ రూ.60కోట్లు, వరంగల్ రెవెన్యూ నుంచి రూ.20కోట్లు.. దాదాపు 250 మంది నిర్వాసితులకు ఇచ్చినా.. మిగిలిన 110 మంది భూనిర్వాసితులకు పరిహారం ఇచ్చేందుకు కుడా చుక్కలు చూపెడుతోందనే విమర్శలున్నాయి. ఐఆర్‌ఆర్ భూనిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం డబ్బులు దాదాపు రూ.20కోట్లు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ) రూపేణా వస్తున్న వడ్డీతో కుడా నిర్వహణ వెళ్లిపోతుందని, అందుకే పరిహారం విషయంలో కుడా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ముఖ్యుల నుంచి వచ్చే ఒత్తిళ్లతో కొందరు నిర్వాసితులకు మాత్రమే నయానో భయానో ముట్టజెబుతున్నారని, ఇతరుల భూపత్రాలు సరిగా లేవంటూ అన్నీ చెక్ చేసుకొని మరోసారి రావాలంటూ పంపుతున్నారన్న టాక్ ఉంది. అయితే రెవెన్యూ అధికారులు చేసిన ఎంజాయిమెంట్ సర్వేను కూడా పరిగణనలోకి తీసుకోకుండా.. కుడాకు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సతాయిస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. కాగా.. 2018లో అప్పటి కలెక్టర్ ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ గడువు ముగియడంతో తాజాగా మళ్లీ కలెక్టర్ ప్రావీణ్య భూసేకరణ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.
ఐఆర్‌ఆర్ వస్తే...
ఐఆర్‌ఆర్ వస్తే వరంగల్ నగర రూపురేఖలు మారనున్నాయి. ముఖ్యంగా ప్రధాన రహదారులపై ప్రభావం చూపే ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గనుంది. హైదరాబాద్, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, నర్సంపేట, ఖమ్మం మీదుగా వచ్చే భారీ వాహనాలు ట్రైసిటీలోకి రాకుండా ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి జాతీయ రహదారిపైకి వెళతాయి. తొలి దశలో రంగశాయిపేట నుంచి నాయుడు పెట్రోల్ పంప్, గవిచర్ల క్రాస్ రోడ్డు, స్తంభంపల్లి, జాన్‌పీరీలు, కీర్తినగర్, ఏనుమాముల, రెండో దశలో కొత్తపేట నుంచి ఆరెపల్లి, దామెర రోడ్డు క్రాస్ వరకు నిర్మించాలని నిర్ణయించారు. 2012 నుంచి మొదలైన ఈ రోడ్డు భూసేకరణకు 89.36 ఎకరాలు అవసరం కాగా.. దాదాపు 70 ఎకరాల ప్రైవేట్ భూమి ఉంది. అయితే 360 మంది నిర్వాసితులు న్నారని గుర్తించిన అధికారులు 250 మందికి పరి హారం చెల్లించారు. ఇంకొందరికి కుడా నిధులు చేతి లో లేకపోవడంతో ఏదో సాకుతో తిప్పుతున్నట్లు ప్రచారంలో ఉంది. ‘మాది ఏనుమాములలో 200 గజాల ప్లాట్ ఉంది. అన్ని డాక్యుమెంట్లు సరిగా ఉన్నా మాకు పరిహారం ఇప్పించేందుకు సతాయిస్తున్నారు. ఏళ్లతరబడి తిరగాల్సి వస్తుంది’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ రైతు చెప్పారు.
కేసులు, వివాదాల వల్లే...
ఐఆర్‌ఆర్ నిర్వాసితుల డబ్బులను బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినట్లు వస్తున్న వదంతుల్లో వాస్తవం లేదు. అన్ని భూపత్రాలు సరిగా ఉండి.. రెవెన్యూ విభాగం పంపించినా ఎంజాయిమెంట్ సర్వే నివేదికలు ఆధారంగా చేసుకొని కొందరు నిర్వాసితులకు పరిహారం ఇస్తున్నాం. ఫ్యామిలీ వివాదాలు, కోర్టు కేసులు ఉన్న వాటిని మాత్రం పెండింగ్‌లో ఉంచాం. వీటిని పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులతో కలిసి పర్యటిస్తున్నాం. కలెక్టర్ ప్రావీణ్య భూసేకరణ నోటిఫికేషన్ ఇవ్వగానే పెండింగ్‌లో ఉన్న వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. కోర్టు కేసుల్లో ఉన్నవాటి విషయంలో డబ్బులు కోర్టులోనే డిపాజిట్ చేస్తాం. అప్పుడు ఆ కేసు ఎవరు నెగ్గుతారో వారి ఖాతాల్లో ఆ డబ్బులు జమ అవుతాయి.
– అజిత్‌రెడ్డి, కుడా ప్లానింగ్ ఉన్నతాధికారి
పదకొండేళ్లుగా తెగని భూసేకరణ
పంచాయితీ
భూరికార్డులు సరిగా లేవంటున్న
‘కుడా’ అధికారులు
మరోసారి నోటిఫికేషన్ ఇచ్చేందుకు
సిద్ధమవుతున్న కలెక్టర్
రింగ్ రోడ్డు పూర్తయితే మారనున్న
నగర రూపురేఖలు