
వరంగల్ లీగల్: బ్యాంక్ లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారంతోపాటు కక్షిదారులకు న్యాయం జరుగుతుందని హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఎం.కృష్ణమూర్తి అన్నారు. వరంగల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జరిగిన బ్యాంక్ లోక్ అదాలత్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా పరిధిలో యూనియన్ బ్యాంకు మొత్తం 23 పీఎల్‌సీ కేసులకు.. రూ.53.70 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం కుదిరిందన్నారు. అలాగే.. హనుమకొండ జిల్లాలో 19 పీఎల్‌సీ కేసులకు.. రూ.43,26,200 చెల్లించడానికి ఒప్పందం కుదిరినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ వరంగల్, హనుమకొండ జిల్లాల కార్యదర్శులు ఉపేందర్‌రావు, బి.శ్రీనివాసులు, యూనియన్ బ్యాంకు రీజినల్ అధికారి పలుగుల సత్యం, లా ఆఫీసర్ ఎం.శశిధర్, వివిధ బ్యాంకు మేనేజర్లు, పలు గ్రామాల కక్షిదారులు పాల్గొన్నారు.
హనుమకొండ జిల్లా ప్రధాన
న్యాయమూర్తి ఎం.కృష్ణమూర్తి