
బాల్యం బడిబయటే!
‘బడిబాట’ నిర్వహిస్తున్నా.. నెరవేరని లక్ష్యం
●
వనపర్తి: విద్యాశాఖ ఏటా జూన్ మొదటి వారంలో బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నా.. జిల్లాలో ఆశించిన మేర ఫలితాలు రావడం లేదన్న నిరాసక్తత అధికార, పాలకవర్గం నుంచి సర్వత్రా వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయులు ఇంటింటి ప్రచారం నిర్వహించినా.. కొన్ని ప్రాంతాల్లోని బాలలు బడికి దూరంగానే ఉంటున్నారు. ఇటీవల బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ కొత్తకోట సీతాదయాకర్‌రెడ్డి తన బృందంతో జిల్లాలో పర్యటించింది. అదే సమయంలో జిల్లాకేంద్రంలో పాఠశాలకు వెళ్లేందుకు బస్సు కోసం కొందరు విద్యార్థులు యూనిఫాం ధరించి ఎదురుచూస్తుండగా.. పక్కనే పలువురు బడిబాట ఎరుగని చిన్నారులు కాగితాలు ఎరుకుంటూ కనిపించిన దృశ్యాలను పట్టణవాసులు ఆమె దృష్టికి తీసుకెళ్లేందుకు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ విద్యా సంవత్సరం జిల్లావ్యాప్తంగా 4,488 కొత్త ప్రవేశాలు చేపట్టామని గొప్పలు చెప్పుకొంటున్న విద్యాశాఖ అధికారులకు ఈ దృశ్యాలు కనిపించవా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గత విద్యాసంవత్సరంతో పోలిస్తే.. ఈసారి సుమారు 500 వరకు కొత్త ప్రవేశాలు తగ్గినట్లు అధికారుల గణాంకాలతో స్పష్టమవుతోంది. ఈ విషయంపై విద్యాశాఖ అఽధికారులు నోరు మెదపడం లేదు. రెండు నుంచి పదోతరగతి వరకు ఆయా పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య పెరిగినట్లు అధికారులు నివేదికలో చూపించారు. అధికారులు మరింత దృష్టి సారిస్తే ప్రవేశాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న భావన అధికార, పాలకవర్గంలో ఉంది. ఇందుకు కారణం విద్యాశాఖలో కీలక పోస్టులను డైట్ అధ్యాపకులకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించి నెట్టుకు రావటమేనన్న ఆరోపణలు లేకపోలేదు.
ప్రభుత్వ ఇంటర్‌పై అనాసక్తి..
జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థుల్లో కనీసం 50 శాతం మంది కూడా ప్రభుత్వ ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల్లో చేరడం లేదు. ఇందుకు గల కారణాలను కొన్నేళ్లుగా డీఐఈఓలు అన్వేషిస్తున్నా ఫలితం మాత్రం శూన్యమేనని చెప్పవచ్చు. జిల్లాలోని ప్రభుత్వ విద్యాలయాల నుంచి ఏటా సుమారు 7 వేల మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు. ఇందులో కనీసం సగం మంది కూడా ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో ప్రవేశాలు పొందడం లేదు.
రెసిడెన్షియల్‌కు ఆదరణ..
అయిదో తరగతి తర్వాత విద్యార్థుల్లో ఎక్కువ మంది రెసిడెన్షియల్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. బాలికలు కేజీబీవీలకు, బాలురు గురుకులాలకు వెళ్తున్నారు. ఒకటో తరగతిలో వచ్చే అడ్మిషన్లు ఆరో తరగతిలో తగ్గిపోతున్నాయి. బడిబాట కార్యక్రమంలో మిగిలిపోయిన బాలలను గుర్తించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం. బడిఈడు పిల్లలందర్ని పాఠశాలలో చేర్పించేందుకు ప్రయత్నం చేస్తున్నాం.
– అబ్దుల్ ఘనీ, జిల్లా విద్యాధిశాఖ
ఏటా సగటున 4,500 మించని
కొత్త ప్రవేశాలు
ప్రతి ఏడాది ‘పది’ ఉత్తీర్ణత సాధిస్తున్న
ప్రభుత్వ విద్యార్థులు
సుమారు ఏడు వేల మంది..
ఇంటర్‌లో ప్రవేశాలకు
50 శాతం మంది అనాసక్తి

బాల్యం బడిబయటే!

బాల్యం బడిబయటే!