
ప్రజావాణి వినతులకు సత్వర పరిష్కారం
వనపర్తి: ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్యతో కలిసి కలెక్టర్ అర్జీదారులతో వినతులు స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఫిర్యాదుదారులకు తగిన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రి ద్వారా వచ్చిన వినతులతో పాటు జిల్లా ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కోరారు. ఉదయం నుంచి మధ్యాహ్నం భోజన విరామ సమయం వరకు జరిగిన ప్రజావాణికి మొత్తం 66 వినతులు వచ్చినట్లు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. ప్రజావాణిలో డీఆర్డీఓ ఉమాదేవి, అన్నిశాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.