
మాట్లాడుతున్న కళావతమ్మ
వనపర్తి క్రైం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు, ధరల పెంపుతో ప్రజలపై భారాన్ని మోపడం దుర్మార్గమని సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు కళావతమ్మ, రమేష్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. విద్యుత్ సర్దుబాటు చార్జీలు యూనిట్‌పై 30 పైసలు పెంచి ఏప్రిల్ నుంచి అదనంగా వసూలు చేసేందుకు విద్యుత్ సంస్థలకు ఈఆర్‌సీ అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఇప్పటికే చార్జీలు మోయలేనంతగా పెరిగాయని.. సర్ధుబాటు చార్జీలు ఉపసంహరించుకోవాలని, లేదంటే ప్రభుత్వమే భరించాలని సూచించారు. సామాన్య రోగులు వాడే 800 రకాల అత్యవసర మందుల ధరలు 12 శాతం పెంచేందుకు రంగం సిద్ధం చేశారన్నారు. 2013లో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్ ధర 110 డాలర్లు ఉన్నప్పుడు.. రూ.76కే లీటర్ పెట్రోల్ వచ్చేదని, బీజేపీ ప్రభుత్వంలో ప్రస్తుతం ముడిచమరు ధర 66 డాలర్లకు తగ్గినా.. లీటర్ పెట్రోల్ రూ.110కి అమ్ముతున్నారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడంతో నిత్యావసరాల ధరలు పెరిగి బతకలేని దుర్భర స్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలు, పన్నులు, చార్జీలు పెంచి సామాన్యులను దోచి ధనవంతులకు పెడుతున్నారని.. ప్రజలు ప్రభుత్వాలకు తగిన బుద్దిచెప్పాలని సూచించారు. సమావేశంలో లావణ్య, జ్యోతి, వంశి తదితరులు పాల్గొన్నారు.