మినీ సమీకృత మార్కెట్లు!

- - Sakshi

అమరచింత: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం నిధులతో గ్రామాల్లో మినీ సమీకృత మార్కెట్ల నిర్మాణానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే గ్రామాల్లో హరితహారం, మిషన్‌ కాకతీయ, భూ అభివృద్ధి, సీసీ రహదారులు, రైతువేదికలు, వైకుంఠధామాలు, వ్యక్తిగత, సామూహిక, మరుగుదొడ్లు, సెగ్రిగేషన్‌ షెడ్లు, పాంపండ్లు, ఇంకుడుగుంతల నిర్మాణాలు ఉపాధి నిధులతోనే చేపడుతున్నారు. కొత్తగా గ్రామాల్లో సంతల నిర్వహణకు మినీ సమీకృత మార్కెట్ల నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదట నిర్మాణాలకు ఆసక్తి చూపే గ్రామపంచాయతీల్లో ప్రారంభించనున్నారు.

ప్రభుత్వ స్థలాల గుర్తింపు..

ప్రభుత్వం ఇప్పటికే పురపాలికల్లో రూ.రెండు కోట్లతో ఇంటిగ్రేడేట్‌ మార్కెట్ల నిర్మాణాలు చేపడుతోంది. ఇక్కడే పండ్లు, కూరగాయలు, మాంసం నిత్యావసర సామగ్రి లభించేలా దుకాణ సముదాయాలను నిర్మిస్తున్నారు. వీటి మాదిరిగానే పెద్ద గ్రామపంచాయతీల్లో సంతబజార్ల నిర్మాణాలకు ప్రణాళిక సిద్ధం చేసింది. ముందుగా పెద్దమందడి, వనపర్తి మండలాల్లో నాలుగు సంతబజార్లు నిర్మించనుంది. ఆయా పంచాయతీలు స్థలాలు గుర్తించి డీఆర్‌డీఏ అధికారులకు తెలియజేస్తే నిధులు మంజూరు చేసే అవకాశం ఉంది.

జిల్లాలో ఇలా..

జిల్లాలోని 14 మండలాల్లో 255 గ్రామపంచాయతీలు ఉండగా.. అందులో 45 పెద్ద గ్రామపంచాయతీలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లోనే తైబజార్‌ వసూలు చేస్తున్నాయి. చాలా గ్రామాల్లో రహదారులు, ఖాళీస్థలాల్లో వారాంతపు సంతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సీసీ రహదారుల నిర్మాణాలు కొనసాగుతుండటంతో పాటు ఖాళీ స్థలాలు కనుమరుగవుతుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే వాహన రాకపోకలకు అవస్థలు పడుతున్నామని వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వం ఉపాధి నిధులతో మినీ ఇంటిగ్రేటేడ్‌ మార్కెట్ల నిర్మాణానికి ముందుకొచ్చింది. జిల్లాలోని పెద్దమందడి, చిన్నమందడి. ఖిల్లాగణపురం, కడుకుంట్లను ఎంపికచేసి అక్కడ నిర్మించి ఇతర పంచాయతీలకు ఆదర్శంగా చూపనుంది. ప్రస్తుతం వనపర్తి మండలం కడుకుంట్లలో పనులు పూర్తికాగా.. మిగిలిన మూడు గ్రామాల్లో సకాలంలో పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామని డీఆర్‌డీఏ అధికారులు తెలిపారు.

అమరచింతలో రహదారిపై కొనసాగుతున్న సంత (ఫైల్‌)

వనపర్తి మండలం కడుకుంట్లలో నిర్మించిన మినీ సమీకృత మార్కెట్‌

కేటగిరీల వారీగా..

కేటగిరీ–1లో పెద్ద పంచాయతీల్లో 30 దుకాణాలతో మార్కెట్‌ సముదాయం నిర్మిస్తారు. ఒక్కో సముదాయ నిర్మాణానికి రూ.15 లక్షలు ఖర్చవుతుంది. గ్రామపంచాయతీ వాటాగా రూ.5 లక్షలు, ఉపాధిహామీ నిధులు రూ. 10 లక్షలు మంజూరు చేస్తారు. కేటగిరీ – 2లో చిన్న గ్రామపంచాయతీల్లో 20 దుకాణాలతో సమీకృత మార్కెట్‌ నిర్మిస్తారు. ఉపాధి నిదులు రూ.9 లక్షలు కాగా.. పంచాయతీ వాటాగా రూ.3.50 లక్షలు చెల్లించాలి.

గ్రామాల్లో ఉపాధి నిధులతో నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం

జిల్లాలో అయిదు గ్రామాలు ఎంపిక

ఒక్కొక్కటి రూ.15 లక్షల వ్యయంతో..

ప్రజాప్రతినిధుల చొరవతోనే..

రహదారిపై వారాంతపు సంత

సంత నిర్వహణకు ప్రత్యేక స్థలం లేకపోవడంతో ప్రధాన రహదారిపైనే కొనసాగుతోంది. స్థానికులే గాకుండా ఇతర గ్రామాల నుంచి క్రయ, విక్రయదారులు వస్తుంటారు. సరైన సౌకర్యాలు ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. మినీ ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మిస్తే బాగుంటుంది.

– కేబీ వెంకటేష్‌, నాగల్‌కడ్మూర్‌

స్థలాలు చూపితే నిధులు..

పంచాయతీ పరిధిలో మినీ స మీకృత మార్కెట్ల నిర్మాణాలకు సర్పంచ్‌లు ప్రభుత్వ స్థలాలు గుర్తించి లేఖ ఇవ్వాలి. ఉన్నతాధికారులకు పంపించి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. నిర్మా ణానికి రూ.15 లక్షలు వ్యయం అవుతుండగా.. గ్రామపంచాయతీ నిధులు రూ.అయిదు లక్షలు అందిస్తే.. ఉపాధి నిధులు రూ.10 లక్షలు మంజూరు చేసి పనులు చేపడతాం. ఈ అవకాశాన్ని పెద్దపంచాయతీలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ విషయాన్ని మండలాల్లోని సిబ్బంది ద్వారా సర్పంచ్‌లకు తెలియజేస్తున్నాం. – నర్సింహులు, డీఆర్‌డీఓ

Read latest Wanaparthy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top