
ప్రజావాణిలో అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
వనపర్తి: సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి వచ్చిన వినతులను వారంలోగా పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి హాజరై ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం భోజన విరామం సమయం వరకు నిర్వహించిన ప్రజావాణికి 67 అర్జీలు వచ్చినట్లు గ్రీవెన్స్‌సెల్ అధికారి శ్రీకాంత్‌రావు తెలిపారు.
● డీఈఓ అక్రమాలపై విచారణ జరిపించాలని పలుమార్లు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవటం లేదని, జిల్లాలోని 15 కేజీబీవీలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో బోగస్ బిల్లులతో చేస్తున్న చెల్లింపులపై విచారణ చేయాలని అర్జీలో పేర్కొన్నారు.
● వనపర్తి పురపాలికలో స్వీపింగ్ మిషన్‌ను ఎలాంటి కొటేషన్, టెండర్ లేకుండా కొనుగోలు చేసి అడ్డగోలుగా డీజిల్, ఉద్యోగుల పేరున ప్రజాధనం వృథా చేస్తున్నారని, ఇటీవల ఆ మిషన్ అగ్ని ప్రమాదానికి గురైందని అఖిలపక్ష ఐక్యవేదిక సభ్యులు ఫిర్యాదు చేశారు.
● జిల్లాకేంద్రంలో రహదారి విస్తరణ పనుల్లో భాగంగా చేపడుతున్న డ్రైనేజీల నిర్మాణం ఎలాంటి టెండర్లు లేకుండా ఇష్టానుసారంగా చేపడుతున్నారని ఫిర్యాదు అందింది. మారెమ్మకుంట సమీపంలోని గ్రామకంఠం భూమిలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నట్లు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.
చలివేంద్రం ప్రారంభం..
పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా జిల్లావ్యాప్తంగా చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించి ప్రజావాణికి వచ్చిన వారికి తాగునీరు అందించారు.
కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
