బొబ్బిలి: సాగునీరు సకాలంతో అందితేనే పంటలు పండుతాయి. రైతులు లాభపడతారు. అదే ఉద్దేశంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉమ్మడి విజయనగరం జిల్లాలోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి కృషిచేసింది. జపాన్ అంతర్జాతీయ సహకార ఏజెన్సీ (జైకా) నిధులతో పనులు చేపట్టింది. ఇంతలో ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి. బిల్లులు చెల్లించినా కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి. పూడుకుపోయిన కాలువలు, పాడైన మదుములు, అభివృద్ధికి నోచుకోని ప్రాజెక్టులను చూసి రైతులు కన్నీరుపెడుతున్నారు. వేసవి కాలంలో పనులు జరగకపోవడంతో ఈ ఏడాది కూడా సాగునీటి తిప్పలు తప్పవంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
● ఇదీ పరిస్థితి...
ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఒట్టిగెడ్డ, పెదంకలాం, వెంగళరాయసాగర్, పెద్దగెడ్డ ప్రాజెక్టుల పరిధిలో 71,063 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. కాలువలు లైనింగ్ సరిగా లేక, మదుములు మరమ్మతులు, ప్రాజెక్టుల ఆధునికీకరణ పనులు జరగక దాదాపు 40 శాతం భూములకు సాగునీరు అందడం లేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రూ.165 కోట్ల జైకా నిధులతో పనులకు పరిపాలనామోదం వచ్చింది. పనులు ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టులకు లైనింగ్‌తో పాటు ప్రధాన ప్రాజెక్టు, స్పిల్‌వే వద్ద ఆధునీకరణ పనులు చేపట్టారు. దశలవారీగా బిల్లులు కూడా అందాయి. ముందుగా గట్ల పటిష్టతను చేశారు. అలాగే, బుష్ క్లియరెన్స్ చేసి ప్రాజెక్టుల గట్లను పటిష్టం చేశారు. ఇలా వరుసగా ఒక్కో ప్రాజెక్టు పనులు పూర్తిచేస్తున్న సమయంలో ప్రభుత్వం మారింది. అంతే, పనులపై శ్రద్ధచూపేవారే కరువయ్యారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో బొబ్బిలి–మక్కువ
మండలాల మధ్య వీఆర్‌ఎస్ కాలువ ఇలా (ఫైల్)
24,500 ఎకరాల ఆయకట్టు ఉన్న వీఆర్‌ఎస్ ప్రాజెక్టుకు లైనింగ్ చేపట్టారు. రూ.8.2 కోట్ల బిల్లులు కూడా ప్రభుత్వం చెల్లించినా మిగులు పనులు పూర్తిచేయలేదు. పెదంకలాం ప్రాజెక్టు పనులకు రూ.36 లక్షల బిల్లులు చెల్లించినా కాంట్రాక్టరు పనులు చేసేందుకు ఆసక్తి చూపడంలేదు. పెద్దగెడ్డ, ఒట్టిగెడ్డకు లక్ష్యం ప్రకారం పనులు చేయలేదని బిల్లులు కూడా చెల్లించలేదు. ఎంతో ముఖ్యమైన ప్రాజెక్టుల ఆధునికీకరణ పనులు వేసవిలో ప్రారంభిస్తేనే జూన్‌లో ఖరీఫ్ నాటికి చివరి ఆయకట్టుకు సాగునీరందించేందుకు వీలుంటుంది. అధికారులు మాత్రం ప్రతిసారీ పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్లకు చెప్పడం, వారు తలూపడం వదిలేయడం మామూలైపోయింది. ఇప్పటికి రెండు సార్లు నోటీసులు ఇచ్చిన ఇరిగేషన్ అధికారులు మరోమారు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు.


