విజయనగరం అర్బన్: పదోతరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల కీర్తిని దశదిశలా చాటిన విద్యార్థులను కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అభినందించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పరిపాలన, విద్యా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల సమర్ధమైన మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల ప్రోత్సాహం, విద్యార్థుల కఠిన శ్రమఫలితంగానే ఈ అద్భుత విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. విద్యార్థులు తమ ఆసక్తులకు అనుగుణంగా కోర్సులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ ఏకాగ్రతతో ఉన్నత చదువుల్లో రాణించి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని హితవు పలికారు. అనంతరం ఉత్తమమార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలను దుశ్శాలువలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులతో కలిసి ఆత్మీయ విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఈఓ యు.మాణిక్యంనాయుడు, డిప్యూటీ ఈఓ కె.వి.రమణ, సహాయ సంచాలకులు అరుణజ్యోతి, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ సన్యాసిరాజు, డీఈఓ కార్యాలయ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


