చందులూరులో ఉపాధి నిధుల మేత..! | - | Sakshi
Sakshi News home page

చందులూరులో ఉపాధి నిధుల మేత..!

May 12 2026 12:26 AM | Updated on May 12 2026 12:26 AM

చందులూరులో ఉపాధిహామీ నిధుల స్వాహాపై కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డికి వివరిస్తున్న గ్రామస్తులు

విజయనగరం గంటస్తంభం:

జిల్లాలో లక్కవరపుకోట మండలం చందులూరు పంచాయతీలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (వీబీజీ రామ్‌జీ) నిధులు అక్రమార్కులకు అక్షయపాత్రగా మారాయి. పేదలకు పని కల్పించాల్సిన నిధులను అధికార టీడీపీ పార్టీ నాయకులు, అధికారులు కలిసి అప్పనంగా బోంచేస్తున్నారు. దాదాపు రూ.2 కోట్ల మేర ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు స్పష్టమవుతోంది. గ్రామసభ తీర్మానాలు లేవు.. సాంకేతిక అనుమతులు లేవు.. కానీ ఎం బుక్కుల్లో మాత్రం రికార్డులు చకచకా నమోదువుతున్నాయి. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న వారిపై, వారికి సహకరిస్తున్న అఽధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, దోచుకున్న సొమ్మును రికవరీ చేయాలని గ్రామస్తులు కలెక్టరేట్‌ వద్ద సోమవారం వినతిపత్రం అందజేశారు.

గత నెల ఏప్రిల్‌లో జరిగిన సామాజిక తనిఖీ(సోషల్‌ అడిట్‌)లో రూ.21 లక్షలు అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. దీనికి బాధ్యులుగా ఏఈ, ఈఏలను గుర్తించి రికవరీకి ఆదేశించారు. అయితే, ఇది కేవలం మంచుకొండ చివర మాత్రమేనని, లోతుగా విచారిస్తే రూ.2 కోట్ల భారీ కుంభకోణం బయటపడుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువుల్లో అక్రమ మైనింగ్‌ జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

రైతులకు కన్నీళ్లు...

అధికారుల మౌనం...

అక్రమార్కులకు వరం

ఒకే తీర్మానం.. అనేక దోపిడీలు!

ఒక్క గ్రామసభ తీర్మానాన్ని పట్టుకుని ఒకే చోట పలుమార్లు వేర్వేరు పనుల పేరిట అనుమతులు పొందుతూ నిధులు కాజేస్తున్నారు. ఒక ప్రాంతంలో రూ.10 లక్షలతో పనులు పూర్తి చేసి, కొన్ని నెలల తర్వాత అదే తీర్మానంతో రూ.40 లక్షల అంచనాలతో మరో పనిని సృష్టించి బిల్లులు డ్రా చేస్తున్నారు. ఆరేళ్ల కిందట వేసిన సిమెంట్‌ రోడ్డుపైనే మళ్లీ రోడ్డు వేసినట్లు చూపి రూ.25 లక్షలు కాజేశారంటే ఇక్కడ అక్రమాలు ఏ స్ధాయిలో జరుగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు.

రూ.2కోట్ల ఉపాధిహామీ నిధులు స్వాహా!

నిబంధనలు తుంగలో తొక్కిబిల్లుల డ్రా..

ప్రజాధనం లూటీ చేస్తున్న పచ్చపార్టీ నేతలు

పాత పనులకే కొత్త రంగులు

అక్రమ మైనింగ్‌తో చెరువుల విధ్వంసం

రైతుల అనుమతి లేకుండానే పొలాల్లో రోడ్లు

ఉపాధి నిధుల గోల్‌మాల్‌పై కలెక్టర్‌కు గ్రామస్తుల ఫిర్యాదు

రైతుల పొట్ట కొడుతున్నారు

మా అనుమతి లేకుండానే మా పొలాల్లో రోడ్లు వేస్తున్నారు. రిటైనింగ్‌ వాల్‌ కట్టడం వల్ల పొలాల్లోకి నీరు చేరి పంట నష్టపోతున్నాం. ట్రాక్టర్లు కూడా దిగనివ్వడం లేదు. అధికార పార్టీ అండ చూసుకుని కొందరు నాయకులు మా బతుకులను ఛిద్రం చేస్తున్నారు. – పి.వి.జగన్నాథం, రైతు, చందులూరు

అడుగడుగునా అవినీతే...

చందులూరులో గ్రామసభ తీర్మానం లేకుండానే కోట్ల రూపాయల పనులు మంజూరు చేసుకున్నారు. టెండర్లు లేవు. పారదర్మకత లేదు. అక్రమ పనులపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. ఈ దోపిడీపై కలెక్టర్‌ సమగ్ర విచారణ జరిపించాలి.

– యడ్ల కిశోర్‌కుమార్‌, ఎంపీటీసీ, చందులూరు

గ్రామంలో బాపుని చెరువు అడ్డుగా సుమారు 600 మీటర్లు పొడవున అక్రమంగా రిటైనింగ్‌ వాల్‌ నిర్మించారు. దీనివల్ల వర్షపునీరు బయటకు వెళ్లే దారిలేక పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి. ఒక నాయకుడికి చెందిన 60 ఎకరాల సైట్‌ ప్రయోజనం కోసం సామాన్య రైతుల అనుమతి లేకుండా వారి పొలాల్లోంచి 60 అడుగుల రోడ్డును దౌర్జన్యంగా నిర్మించారు. ఈ అక్రమ నిర్మాణాల వల్ల ట్రాక్టర్లు కూడా పొలాల్లోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement