పిల్లల భవిష్యత్తుకు మాది భరోసా | - | Sakshi
Sakshi News home page

పిల్లల భవిష్యత్తుకు మాది భరోసా

May 12 2026 12:26 AM | Updated on May 12 2026 12:26 AM

పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించండి

కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి

విజయనగరం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయని, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి, సదుపాయాలు చూసి తమ పిల్లలను చేర్పించాలని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి పిలుపునిచ్చారు. వివిధ కార్పొరేట్‌ పాఠశాలల్లో చదువుతున్న 26 మంది విద్యార్థులు ఒకేసారి జమ్ము నారాయణపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రవేశాలు పొందారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులను కలెక్టర్‌ ప్రత్యేకంగా అభినందించి ప్రోత్సహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ పాఠశాలలకు ఏ మాత్రం తీసిపోని విధంగా మౌలిక వసతులు, డిజిటల్‌ సదుపాయాలు, నాణ్యమైన బోధన అందిస్తున్నామని తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించగల నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారని పేర్కొన్నారు. జిల్లాలో ఈ ఏడాది పదోతరగతి ఫలితాల్లో 91 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచామని కలెక్టర్‌ గుర్తు చేశారు. జిల్లాలో 60 పాఠశాలలు శతశాతం ఉత్తీర్ణత సాధించాయని తెలిపారు. 591కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 13 మంది, 585కు పైగా మార్కులు సాధించిన వారు 68 మంది, 550కు పైగా మార్కులు సాధించిన వారు 1238 మంది, 500కు పైగా మార్కులు సాధించిన వారు 4,174 మంది ఉన్నారని వెల్లడించారు. ఈ ఫలితాలే ప్రభుత్వ పాఠశాలల నాణ్యతకు నిదర్శనమని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యంనాయుడు, ఎంఈఓలు పి.సత్యవతి, సీహెచ్‌ ఆనందమూర్తి, ప్రధానోపాధ్యాయులు వి.హరికృష్ణ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement