ఉచితంగానే చేయాలి...
●డబ్బులు ఇస్తేనే పోస్టుమార్టం ●పైసలివ్వకుంటే అంతే.. ●రూ.3 వేల నుంచి రూ.5వేల వరకు వసూలు!
●విజయనగరం మండలానికి చెందిన నారాయణమ్మ అనే వృద్ధురాలు మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతురాలిని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అక్కడ సిబ్బంది పోస్టుమార్టం చేయడం కోసం రూ.3200 మృతురాలి బంధువుల నుంచి
తీసుకున్నట్టు తెలిసింది. రూ.1000 కంటే ఎక్కువ ఇచ్చుకోలేం..
అని చెప్పినప్పటకీ సిబ్బంది ఒప్పుకోకపోవడంతో
అడిగినంత ఇవ్వక తప్పలేదు.
●గంట్యాడ మండలానికి చెందిన
ఎర్నాయుడు అనే వ్యకి రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం చేయడానికి రూ.2500
తీసుకున్నట్టు సమాచారం.
●విజయనగరం పట్టణానికి చెందిన
ఓ మహిళ అగ్ని ప్రమాదంలో ఇటీవల
మృతి చెందింది. ఆమె మృతదేహానికి కూడా పోస్టుమార్టం చేయడానికి
రూ.3 వేలు వరకు తీసుకున్నట్టు
ఆరోపణలు ఉన్నాయి.
విజయనగరం ఫోర్ట్:
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వచ్చే మృతదేహాల పోస్టుమార్టంకు అక్కడ ఉన్న సిబ్బంది రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఓ వైపు తమ కుటుంబసభ్యులు మృతి చెందారనే ఆవేదనతో బంధువులు ఉంటే... మృతదేహం పోస్టుమార్టం కోసం ఇలా పైసలు పేరిట సిబ్బంది వేధించడంతో వాళ్లు మరింత కృంగిపోతున్నారు. చివరకు శవాలను కూడా వదలడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇంతకంటే దౌర్భగ్యం ఏముందంటూ వారు కన్నీరుమున్నీరవుతున్నారు. రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలకు పాల్పడే వారి మృతదేహాలు ఇక్కడకు పోస్టుమార్టం నిమిత్తం వస్తాయి. వీటిపై కింది సిబ్బంది కాసుల వేట సాగిస్తున్నారు. బంధువులు ఎవరైనా ఇదేమని ప్రశ్నిస్తే పోస్టుమార్టం అనంతరం మృతదేహం అప్పగింతలో చెప్పలేనంత ఆలస్యం చోటు చేసుకుంటుందన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి. దీంతో తీరని ఆవేదనలో కూడా మృతుల కుటుంబసభ్యులు సిబ్బంది అడిగినంత ముట్టజెప్పక తప్పడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
రూ.3 వేల నుంచి రూ.5 వేలు వరకు వసూలు
మృతదేహం పోస్టుమార్టం చేయడానికి కూడా సిబ్బంది నిర్ధిష్టమైన ధర నిర్ణయించి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం రూ.3 వేలకు తక్కువైతే పోస్టుమార్టం చేయకుండా అక్కడ వైద్య సిబ్బంది కావాలనే జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చేసేది లేక సిబ్బంది అడిగినంత సమర్పించుకుంటున్నారు. తాము పేదవాళ్ల మని ఎంతగా ప్రాధేయపడుతున్నా... సిబ్బంది కనికరించడం లేదు. పోస్టుమార్టం గదిలో విధులు నిర్వహించాల్సిన వారు పూర్తిగా మానవత్వాన్ని మరచి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా ఆస్పత్రి వైద్యాధికారులకు సైతం ఈ విషయం తెలిసినప్పటికీ తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు మార్చురీ సిబ్బంది అడిగినంత ఇచ్చేయండని కొందరు పోలీసులు కూడా చెబుతున్నట్టు విమర్శలు ఉన్నాయి. ఇలా శవాలపై కాసుల దందా సాగిస్తున్న దానిపై ఆస్పత్రి ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలకు పాల్పడిన వ్యక్తుల మృతదేహాలు ఆస్పత్రికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా ఉచితంగా పోస్టుమార్టం చేయాలి. డబ్బులు వసూలు చేయడం కూడదు. అలా చేసినట్టు నా దృష్టికి రాలేదు. ఒక వేళ ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే లిఖితపూర్వకంగా బాధితులు ఫిర్యాదు చేయాలి. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి


