వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులో నీటిమట్టం గణనీ యంగా తగ్గింది. వేసవి కారణంగా వర్షపాతం తక్కువగా ఉండడంతో వేగావతి, సువర్ణముఖి నదుల్లో ఇన్‌ఫ్లోస్ భారీగా పడిపోయాయి. దీంతో ఆదివారం ప్రాజెక్టు వద్ద 62.47 మీటర్లు లెవెల్ నమోదైంది. వాస్తవంగా ప్రాజెక్టు అసలు నీటిమట్టం 65 మీటర్లు లెవెల్ ఉండగా దాదా పు 2.47 మీటర్లు మేర నీటి నిల్వ తగ్గింది. దీంతో ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో 3.37 టీఎంసీల కెసాసిటీ కలిగిన ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 1.33 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే నమోదైంది. ప్రాజెక్టు అధికారులు ప్రణాళిక ప్రకారం జూన్ మొదటి వారంలో ఖరీఫ్ పంటల సాగుకు నీరు విడుదల చేయాల్సి ఉంది. అలా జరగాలంటే వరుణుడు కరుణించాల్సిందేనని రైతులు చెబుతున్నారు.
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న రామారావుకు ఉద్యోగోన్నతి లభించింది. ఆయనను గ్రేడ్–2 ఈఓగా నియమిస్తూ దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో మాన్సాస్ సంస్థతో పాటు విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయంలో సుదీర్ఘ కాలం విధులు నిర్వర్తించారు. రామతీర్థం దేవాలయంలో మూడేళ్ల నుంచి సీనియర్ అసిస్టెంట్ హోదాలో సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఈఓగా ఉద్యోగోన్నతి లభించడంతో దేవస్థాన ఈఓ వై.శ్రీనివాసరావు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
విజయనగరం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రం రామనారాయణంలో ఈ నెల 12న హనుమాన్ జయంత్యుత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు ఎన్సీఎస్ ట్రస్టీ నారాయణం శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా రామనారాయణ ప్రాంగణంలో హనుమాన్ జయంత్యుత్సవాల ఆహ్వాన ప్రతులను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంగళవారం ఉదయం 6 గంటలకు పంచామృత అభిషేకం, స్నపనం నిర్వహించనున్నట్టు తెలిపారు. 8 గంటలకు లక్ష తమలపాకులు, సింధూరంతో సహస్ర నామార్చనలు, హనుమాన్ చాలీసా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటలకు 60 అడుగుల అభయాంజనేయ స్వామికి మహా హారతి, లేజర్ షో కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న బోడికొండపై అభయాంజనేయస్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రాష్ట్ర సాధు పరిషత్ ఆధ్వర్యంలో కొండకు దిగువ భాగంలో ఏర్పాటు చేసిన పిల్లర్‌పై క్రేన్ సహకారంతో ఆదివారం విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సుమారు పదమూడున్నర అడుగుల ఎత్తు, రెండు టన్నుల బరువుతో ఈ విగ్రహాన్ని రూపొందించారు. వచ్చే నెలలో విగ్రహానికి ప్రాణ ప్ర తిష్ఠ కార్యక్రమాలు జరిపిస్తామని నిర్వాహకు లు తెలిపారు.


