● పరిష్కారం కాని దళితుల శ్మశాన, అసైన్డ్ భూవివాదం
● రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతున్న రెవెన్యూ అధికారులు
● సివిల్, క్రిమినల్ కేసులు పెడతామంటున్న రిటైర్డ్ జడ్జి
జియ్యమ్మవలస రూరల్: కొన్నేళ్లుగా మండలంలోని చింతలబెలగాం గ్రామ దళితులకు సంబంధించిన శ్మశాన వాటిక, అసైనన్డ్ భూములపై వివాదం కొనసాగుతోంది. దళితుల అసైన్డ్ భూముల రెవెన్యూ ట్యాంపరింగ్, ఆన్‌లైన్ మార్పులు, ఆక్రమణలు శ్మశాన వాటిక ఆక్రమణ ఇలాంటి ఎన్నో విషయాలపై సామాజిక కార్యకర్త బెలగాం ప్రవీణ్ కుమార్ అనేకమార్లు ఆర్డీవో, సబ్ కలెక్టర్, కలెక్టర్లకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇంతవరకు ఎలాంటి చర్యలూ చేపట్టని పరిస్థితుల్లో ప్రకాశం జిల్లా విశ్రాంత న్యాయమూర్తి, ప్రస్తుత హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ ఎస్ శ్యాం సుందర్ జయరాజు గ్రామాన్ని ఆదివారం సందర్శించారు. దళితులకు జరిగిన అన్యాయంపై ఆయన విచారణ చేసి ఇదే గ్రామంలో దళిత మహిళ మృతదేహాన్ని శ్మశాన వాటికలో ఖననం చేస్తే స్థానికులు ఆ భూమిని ఆక్రమించి పాతిపెట్టిన మృతదేహాన్ని తిరిగి బయిటకు తీయించి వేరే చోటకు మార్పించిన ఘటన పోలీసులు, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో జరగడం దుర్మార్గమని పేర్కొన్నారు. ప్రభుత్వం దళితులకు కేటాయించిన అసైన్డ్ భూమిని స్థానిక రిటైర్డ్ వీఆర్‌ఓ తన కుమార్తె పేరున పాస్‌బుక్ ఎలా చేయించుకున్నారో చెప్పాలని ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అందుకు సహకరించిన రెవెన్యూ అధికారులను సైతం వదిలిపెట్టేది లేదని తక్షణమే అసైన్డ్ భూమిని దళితులకు విడిచిపెట్టకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ హైకోర్టులో కేసు వేస్తామని హెచ్చరించారు.
మానవ హక్కుల ఉల్లంఘన కింద కేసు
దళితులకు శ్మశాన వాటికకు అవసరమైన స్థలాన్ని కలెక్టర్, సబ్ కలెక్టర్ పరిశీలించి అప్పగించాలని కోరారు. దళితులకు కేటాయించిన అసైన్డ్ భూముల్లో నిజానిజాలు పరిశీలించి వారికి తగు న్యాయం చేయాలని కోరారు. కాదని స్థానిక నాయకులు అడ్డుకుంటే మానవ హక్కుల ఉల్లంఘన కింద కేసు వేస్తామని హెచ్చరించారు. ఈ విషయంపై దళితులకు న్యాయం జరిగేందుకు పోరాడుతున్న ప్రవీణ్‌ను బెదిరింపు చర్యలకు పాల్పడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముందుగా చింతల బెలగాంలో దళితుల శ్మశాన వాటికను పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా దళితులు అణిచివేతకు గురవుతున్నారని, ప్రశ్నించే వారి గొంతునొక్కేస్తున్నారని ఇలాంటి పరిస్థితుల్లో వారంతా ఐక్యమత్యంతో పోరాటాలు చేస్తే కానీ న్యాయం జరిగిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తాను దళితుల వైపు బడుగు బలహీన వర్గాల వైపు పని చేస్తూ వారికి అన్నివేళలా తన వంతు సహాయ సహకారాలను అందిస్తానని తెలిపారు.


